మెదక్,ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : సింగూర్ ప్రాజెక్టు నుంచి ఘన్పూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేసి పంటలు కాపాడాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్‌కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ నీటి విడుదలకు ఆదేశించారు. సింగూర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 7.39 టీఎంసీల నీటి నిల్వ ఉన్నదని, పంటలు కాపాడేందుకు ఘనపూర్ ఆనకట్టకు 0.30 టీఎంసీల నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి, మేనేజింగ్ డైరెక్టర్ మెట్రోపాలిటన్ వాటర్ సైప్లె, సీవరేజ్ బోర్డు హైదరాబాద్, సంగారెడ్డి కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి ఇప్పుటి వరకు 0.90 టీఎంసీల నీటిని మూడు విడతల్లో విడుదల చేశారని, మరో 0.30 టీఎంసీల నీటిని వెంటనే విడుదల చేస్తే వరి పంట దక్కుతుందని పద్మాదేవేందర్‌రెడ్డి రైతులతో కలిసి హెచ్ఆర్సీ చైర్మన్ కలిసి కోరారు. స్పందించిన మానవ హక్కుల కమిషన్ చైర్మన్ నీటి విడుదలకు ఆదేశాలివ్వడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.