Sircilla | హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): జాతీయ పక్షి నెమలి కూరను ఎలా వండాలో వివరించి కటకటాలు లెక్కపెడుతున్నాడు సిరిసిల్లకు చెందిన ఓ యూట్యూబర్. సిరిసిల్లలోని తంగళ్లపల్లికి చెందిన కోడం ప్రణయ్‌కుమార్ సంప్రదాయ వంటకాలపై వీడియోలు చేసి శ్రీటీవీ అనే యూట్యూబ్ చానెల్లో అప్లోడ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో శనివారం సాంప్రదాయ పద్ధతిలో నెమలి కూర ఎలా వండాలో చూడండి అంటూ ‘ట్రెడిషనల్ పీకాక్ కర్రీ రెసిపీ’ అన్న పేరుతో యూట్యూబ్‌లో వీడియో అప్లోడ్ చేశాడు. దీనిపై జంతు ప్రేమికులనుంచే కాకుండా సామాన్యుల నుంచి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో వెంటనే స్పందించిన యూట్యూబ్ ఆ వీడియోను తొలగించింది.
కానీ అప్పటికే ఓ 140 మందికి పైగా ఆ వీడియో చూశారు. అతడే నిషేధిత జాబితాలో ఉన్న అడవిపంది కూర ఎలా ఉండాలో కూడా వీడియో తీసి ఇంతకుముందు అప్లోడ్ చేశాడు. వన్యమృగాలను, జాతీయ పక్షిని వేటాడం నేరమని తెలిసి కూడా వాటిని చంపి కూర వండటమే కాకుండా.. ఆ వీడియోలను అప్లోడ్ చేయడంపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. ఈ విష యం తెలిసిన సిరిసిల్ల ఫారెస్ట్ అధికారులు ప్రణయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దనుంచి నెమలికూర వీడియోను స్వాధీనం చేసుకున్నామని ఎఫ్ఆర్వో కల్పనాదేవి చెప్పారు. అతని వద్ద స్వాధీనం చేసుకున్న కూరను ల్యాబ్ టెస్ట్‌కు పంపించామని తెలిపారు.