హైదరాబాద్: కపట కాంగ్రెస్ పాలనలో కడుపునింపే అన్నదాత ఆగమైండని, చేనేత కార్మికుడు చితికిపోతున్నదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ వైఫల్యం, పాలకుడి నిర్వాకంతో ప్రతి నేతన్న నడిరోడ్డు మీద పడ్డడాని విమర్శించారు. నాడు తెలంగాణ అవకాశాల గని, చేనేత కార్మికుడికి చేతినిండా పని.. కానీ నేడు చేతకాని కాంగ్రెస్ పాలన కార్మికుల పాలిట శనిగా మారిందని చెప్పారు. బతుకమ్మ చీరల ఆర్డర్లకు అడ్రస్ లేదని, ప్రభుత్వ పెండింగ్ బిల్లులకు మోక్షం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అసమర్థ పాలనలో దిక్కుతోచని నేతన్నకు చేసేందుకు పనిలేదని, తినేందుకు తిండి లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ తెచ్చిన సబ్సిడీ పథకాన్ని అధికారంలోకి రాగానే సమాధి చేశారని, చేనేత మిత్ర పథకానికి నిలువునా పాతరేశారని విమర్శించారు. ఇలా ఇంకెంతకాలం అన్యాయాల జాతర చేస్తారని ప్రశ్నించారు. ఢిల్లీలోని బడే-భాయ్ జీఎస్టీ దెబ్బకు ఈ రంగం కుదేలైందని, గల్లీలోని ఛోటే-భాయ్ నిర్లక్ష్యానికి నిలువునా బలైందని ప్రధాని మోదీ, రేవంత్ రెడ్డిలను ఉద్దేశించి అన్నారు. అందుకే మూలనపడ్డ మగ్గం సాక్షిగా చేనేత కార్మికులను చిన్నచూపు చూస్తున్న భస్మాసుర హస్తానికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.