హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): గోదావరిలో మిగులు జలాలే లేవని, అలాంటప్పుడు గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టు ఎలా సాధ్యమని జాతీయ జలాభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)ను ఏపీ సర్కారు ప్రశ్నించింది. ఎన్‌డబ్ల్యూడీఏ జనరల్‌బాడీ మీటింగ్ ఈ నెల ఒకటిన జరిగింది. ఆ సమావేశం మినట్స్‌ను తాజాగా రాష్ర్టాలకు పంపింది. ఆ సమావేశంలో తెలంగాణ గతంలో చేసిన వాదనలనే పునరుద్ఘాటించింది. జీసీ లింక్‌ను చేపడితే గోదావరి నుంచి తరలించే నీళ్లలో అసలు భాగమేకానీ కర్ణాటకకు నీటి వాటాను ఎలా ఇస్తారని ప్రశ్నించింది.
తరలించే 148 టీఎంసీల్లో 74 టీఎంసీలు తెలంగాణకే ఇవ్వాలని, గోదావరిపై నిర్మించిన తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులివ్వాలని, వరద జలాల్లో 200 టీఎంసీలను వాడుకునేందుకు అనుమతులివ్వాలని డిమాండ్ చేసింది. లింక్ ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నామని, కేంద్రం కూడా తమ డిమాండ్లకు ఒప్పుకోవాలని తెలంగాణ తెలిపింది. ఏపీ చేపడుతున్న చింతలపూడి, బాబూ జగ్జీవన్‌రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వైఎస్సార్ పల్నాడు డ్రౌట్ మిటిగేషన్ ప్రాజెక్ట్, గుండ్రేవుల రిజర్వాయర్లను అనుమతించవద్దని కోరింది. జీసీ లింక్‌లో తమకూ నీటి వాటాలు ఇవ్వాలని, ఇంట్రా లింక్ ప్రాజెక్టులకు అంగీకరించాలని మహారాష్ట్ర డిమాండ్ చేసింది.
జీసీ లింక్ ఎలా సాధ్యం?
ఇదిలా ఉంటే గోదావరిలో మిగులు జలాలు లేవని, అలాంటప్పుడు జీసీ లింక్ ఎలా సాధ్యమవుతుందని ఏపీ ప్రశ్నించింది. జీసీ లింక్‌లో తరలించే 148 టీఎంసీలు ఇంద్రావతి సబ్‌బేసిన్ నుంచి వచ్చేవని, అది కూడా తాతాలికమేనని వెల్లడించింది. అలాంటప్పుడు జీసీ లింక్ ఎలా సాధ్యమని నిలదీసింది. అయితే గోదావరిలో మిగులు జలాలు లేవని చెప్తున్న ఏపీనే వరద జలాల మాటున పోలవరం బనకచర్ల ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమవడం కొసమెరుపు. 200 టీఎంసీలను తరలించేందుకు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేయడంతోపాటు, ఆర్థిక సాయానికి కేంద్రాన్ని అర్థించడం, పీఎఫ్ఆర్ను సమర్పించడం, తాజాగా డీపీఆర్ తయారీకి టెండర్లను కూడా పిలవడం గమనార్హం.