వరంగల్‌చౌరస్తా, డిసెంబర్ 21: హౌసింగ్ బోర్డు ఫ్లాట్స్ రోడ్డు వ్యవహారం పక్కదారి పట్టింది. హౌసింగ్ బోర్డు ఆధీనంలో ఉన్న 102 ఫ్లాట్స్‌ను డ్రా పద్ధతిలో అమ్మకాలు జరపడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించడంతో విల్లావాసులు రోడ్డు మార్గం మార్చాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లారు. ‘మీకు కావాల్సిన రీతిన రోడ్డు మార్గంలో మార్పులు చేస్తాం’ అని సంపన్నులకు వత్తాసు పలికిన మంత్రి.. వెంటనే తన అనుచరుడికి ఆదేశాలు జారీ చేశారు. రైల్వే స్టేషన్‌కు అనుసంధానంగా ఉన్న ఆయిల్ కార్పొరేషన్ దారివైపు రాంకీ ఎన్క్లేవ్ ప్రహరీని కూల్చి.. రాంకీ విల్లాలకు హౌసింగ్ బోర్డు ఫ్లాట్ల మధ్య రోడ్డుకు అడ్డుగోడ నిర్మాణం చేపట్టడానికి మంత్రి అనుచరుడి ఆధ్వర్యంలో పనులు చేపట్టారు.
అందులో భాగంగా ఆదివారం ఉదయం సంబంధిత అధికారుల అనుమతులు, సంప్రదింపులు లేకుండానే భారీ యంత్రాలతో ప్రహరీని కూల్చివేశారు. అధికారుల అనుమతి లేనిదే కూల్చివేతలు చేపట్టవద్దని హౌసింగ్ బోర్డు తాత్కాలిక సిబ్బంది చెప్పినా వినకుండా.. ‘మంత్రి సురేఖ మేడం ఆదేశించారు. అనుమతులు అవే నడుచుకుంటూ వస్తాయి. పక్కకి తప్పుకోవాలి’ అంటూ మంత్రి అనుచరుడు శనివారం బెదిరింపులకు పాల్పడి మరీ దగ్గరుండి కూల్చివేతలు చేపట్టినట్టు సిబ్బంది తెలిపారు.
హౌసింగ్ బోర్డు తన ఆధీనంలో ఉన్న 102 ఫ్లాట్స్‌ను డ్రా పద్ధతిలో అమ్మకాలు జరపడానికి నోటిఫికేషన్ విడుదల చేయడంతో నిత్యం వందల సంఖ్యలో ఔత్సాహికులు ఫ్లాట్లను సందర్శించడానికి వస్తున్నారు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన రోడ్డు మార్గంలో అడ్డంకులు కనిపిస్తుండటం, ప్రహరీని కూల్చి గేటు నిర్మాణానికి పనులు చేపట్టడంతో ఔత్సాహికులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆయిల్ కార్పొరేషన్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ రోడ్డు ద్వారా హౌసింగ్ బోర్డు ఫ్లాట్స్ వాసులు రాకపోకలు సాగించడానికి సంబంధిత సంస్థ అనుమతించని పక్షంలో కొనుగోలు అనంతరం ఇ బ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని పలువురు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. అనుమతులు లేకుండా ప్రహరీ కూల్చడంపై హౌసింగ్ బోర్డు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వారి ఆదేశాల మేరకు వరంగల్ డివిజన్ ఈఈ అంకమరావు ఆదివారం రాత్రి మంత్రి అనుచరుడితోపాటు రాంకీ విల్లాస్ అసోసియేషన్ ప్రతినిధులపై స్థానిక మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.