హైదరాబాద్, డిసెంబరు 18(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ గచ్చిబౌలి సహా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నిర్మించిన అల్పాదాయ వర్గాల (ఎల్ఐజీ) గృహ సముదాయాల్లో ఫ్లాట్ల విక్రయానికి హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ జారీచేసింది. మూడు ప్రాంతాల్లో మొత్తం 339 ఫ్లాట్లను లాటరీ పద్ధతిలో విక్రయించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్‌చైర్మన్ వీపీ గౌతమ్ తెలిపారు. ఏడాదికి రూ.6లక్షల ఆదాయం (నెలకు రూ.50వేలు) ఉన్నవారికే కేటాయించనున్నట్లు చెప్పారు. గచ్చిబౌలిలో 111 ఫ్లాట్లు, వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలోని అపార్ట్మెంట్లో 102, ఖమ్మం శ్రీరామ్‌హిల్స్ వద్ద 126 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు.
ఫ్లాట్ల విస్తీర్ణం 450 నుంచి 650 చదరపు అడుగుల వరకు ఉన్నట్టు, గచ్చిబౌలి ప్రాంతంలోని ఫ్లాట్ల ధర రూ.26 లక్షల నుంచి గరిష్ఠంగా 36.20 లక్షల వరకు ఉందన్నారు. వరంగల్‌లో రూ.19 – 21.50 లక్షలు, ఖమ్మంలో రూ.11.25 లక్షలకు ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఆసక్తి గలవారు ఆన్లైన్ లేక మీసేవా కేంద్రాల్లో జనవరి 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గచ్చిబౌలి ఫ్లాట్ల కేటాయింపు జనవరి 6న, వరంగల్‌లోని ఫ్లాట్ల కేటాయింపు 8న, ఖమ్మం ఫ్లాట్ల కేటాయింపు జనవరి 10వ తేదీన లాటరీ ద్వారా ఉంటుందని, విక్రయాలకు సంబంధించిన పూర్తి వివరాలు హౌసింగ్ బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు గౌతమ్ తెలిపారు.