Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు రియల్ ఎస్టేట్‌కు స్వర్గధామం లాంటి హైదరాబాద్ ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నది. నాడు ఎకరం రూ.వంద కోట్లకు విక్రయించిన స్థాయి నుంచి నేడు ఏడాదిలో 70 వేల యూనిట్లను కూడా విక్రయించుకోలేని స్థాయికి దిగజారింది. 2023లో అసెంబ్లీ ఎన్నికల హడావుడితో మొదలైన మార్కెట్ స్తబ్ధత.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత కూడా కొనసాగుతున్నది. కాంగ్రెస్ సర్కారు తీసుకున్న అస్పష్టమైన నిర్ణయాలు, హైడ్రా కూల్చివేతలు, తిరోగమన విధానాలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో ఒకప్పుడు రియల్టీలో రారాజుగా వెలిగిన హైదరాబాద్ రియల్టీ రంగం కట్టిన ఇండ్లనూ అమ్ముకోలేని దీనస్థితికి చేరింది. ఫలితంగా ఏడాదిలో రెసిడెన్షియల్ ఇండ్ల అమ్మకాలు 22 శాతం క్షీణించాయి. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ తీరుతెన్నులను విశ్లేషిస్తూ క్రెడాయ్ హైదరాబాద్, సీఆర్ఈ మ్యాట్రిక్స్ సంస్థ సంయుక్తాధ్వర్యంలో ‘హైదరాబాద్ హౌజింగ్ రిపోర్ట్’ పేరిట మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2023 నుంచి 2024 వరకు మొత్తం 8 త్రైమాసికాల్లో ఇండ్ల అమ్మకాల ట్రెండ్ ఆధారంగా నివేదిక రూపొందింది.
హైదరాబాద్ కేంద్రంగా రిజిస్ట్రేషన్, రేరా అనుమతులతో కూడిన వాస్తవిక గణాంకాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను తయారు చేశారు. నగరం నలువైపులా ఉన్న మార్కెట్ స్థితిగతులు, క్రయవిక్రయాలు, ధరలు వంటి అంశాలతో ఈ నివేదికను ఆవిష్కరించారు. హైదరాబాద్ నగరాన్ని నాలుగు భాగాలుగా విభజించి, ఆయా ప్రాంతాల్లో జరిగిన రిజిస్ట్రేషన్లు, పొందిన రెరా అనుమతులను ప్రామాణికంగా తీసుకున్నారు. నార్సింగి నుంచి మణికొండ, శేరిలింగంపల్లి నుంచి గండిమైసమ్మ వరకు విస్తరించిన ప్రాంతాన్ని నార్త్ వెస్ట్గా, గండిమైసమ్మ నుంచి బోడుప్పల్ వరకు నార్త్ ఈస్ట్‌గా, ఉప్పల్ నుంచి బాలాపూర్ వరకు సౌత్ ఈస్ట్‌గా, బాలాపూర్ నుంచి నార్సింగి వరకు సౌత్ వెస్ట్ నగరంగా విభజించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న క్రయవిక్రయాలు, కొత్త ప్రాజెక్టుల లాంచింగులు, అమ్ముడుపోని యూనిట్ల సంఖ్య, ధరల తీరు వంటి అంశాలతో సమగ్రమైన నివేదికను క్రెడాయ్-హైదరాబాద్, సీఆర్ఈ మ్యాట్రిక్స్ సంస్థలు రూపొందించాయి.
ఐటీకి కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో ఏటా లక్ష నుంచి లక్షన్నర యూనిట్లు మార్కెట్లోకి వస్తుండేవి. కానీ, ఏడాదిగా కొత్త ప్రాజెక్టుల లాంచింగ్‌లు కనిపించడం లేదు. 2023-2024 మధ్యకాలంలో ఆవిష్కరించిన కొత్త ప్రాజెక్టుల గణాంకాలే అందుకు నిదర్శనం. అస్పష్టమైన, ఆందోళనకరమైన పరిస్థితుల్లో కొత్త ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవడం కంటే… నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం లేదా, పేరుకుపోయిన ఇన్వెంటరీని తగ్గించుకోవడంపైనే వ్యాపారులు దృష్టి పెట్టారు. దీంతో 2023 చివరి త్రైమాసికంలో 22వేల యూనిట్లుగా ఉన్న ఇన్వెంటరీ పరిమాణం… 2024 చివరి త్రైమాసికం నాటికి ఏకంగా 11 వేలకు తగ్గింది. ఇక 2023లో కొత్త ప్రాజెక్టుల ద్వారా 95,911 యూనిట్లు మార్కెట్లోకి వస్తే.. 2024 నాటికి లాంచ్ అయిన యూనిట్ల సంఖ్య 48,534కు పరిమితమైంది.
2023 నుంచి 2024 వరకు చూసుకుంటే అమ్మకాలు, కొత్త ప్రాజెక్టులన్నీ ఐటీ కారిడార్ కేంద్రంగానే సాగాయి. ఈ రెండేళ్లలో సగటున హైదరాబాద్ రియల్టీ డిమాండ్ 60 శాతానికిపైగా ఈ ప్రాంతంలోనే విస్తరించి ఉంది. ఆ తర్వాతి స్థానంలో సౌత్ వెస్ట్ ప్రాంతమైన బాలాపూర్ నుంచి నార్సింగి వరకు రియల్ వ్యాపారులు, కొనుగోలుదారులు మొగ్గుచూపారు. ఈ ప్రాంతాల మధ్య 30 శాతానికి పైగా విస్తరించి ఉండగా.. సీఎం రేవంత్ కలలు కంటున్న ఫోర్త్ సిటీ విస్తరించి ఉన్న నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ప్రాంతాల్లో డిమాండ్ లేకపోవడం గమనార్హం. గడ్డిమైసమ్మ నుంచి బాలాపూర్ వరకు విస్తరించి ఉన్న రెండు కారిడార్లు కలిపితే సగటున 5-8 శాతంలోపే డిమాండ్ ఉంది. ఫోర్త్ సిటీ పేరిట లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకువస్తున్నామని సర్కారు గప్పాలు కొడుతున్నా.. క్షేత్రస్థాయిలో ఏ మాత్రం ప్రభావం చూపలేదని స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ విధివిధానాలతోపాటు, రియల్ ఎస్టేట్ రంగాన్ని భయాందోళనలకు గురిచేసే కార్యకలాపాలే కారణమని స్పష్టమవుతున్నది.
దేశంలోని అన్ని మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ రంగం గతంలో పరుగులు పెట్టేది. కానీ, కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయాలతో ఇప్పుడు పడకేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులను రద్దు చేయడం.. చెరువుల సంరక్షణ, మూసీ ప్రక్షాళన పేరిట సీఎం రేవంత్‌రెడ్డి అమలుచేసిన విధానాలు భయాందోళనలకు కారణమై మార్కెట్‌ను కుప్పకూల్చాయి. ఇక రియల్ ఎస్టేట్ రంగానికి అనుకూలమైన అంశాలపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకపోవడం కూడా కారణమనే అభిప్రాయమూ వ్యక్తమవుతున్నది.
ఇప్పటికైనా రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేలా, అమ్మకాలను ప్రభావితం చేసేలా, కొనుగోలుదారులకు భరోసా కల్పించేలా ప్రభుత్వం విధానాలను ప్రకటిస్తే తప్ప మార్కెట్ కోలుకునే పరిస్థితి లేదని పలువురు చెబుతున్నారు. బిల్డర్లను ప్రోత్సహించేలా భవన నిర్మాణ అనుమతుల ఫీజులను వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించడం, మహారాష్ట్ర ప్రభుత్వం తరహాలో రిజిస్ట్రేషన్ చార్జీల్లో రాయితీలను ప్రకటించడం, తదితర చర్యల ద్వారా మార్కెట్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుందని రియల్టర్లు పేర్కొంటున్నారు. ఈ మేరకు గతంలో సీఎం ఇచ్చిన హామీ ప్రతిపాదనలకే పరిమితమైంది. మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టకుండా, రాజకీయాలకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది.
త్రైమాసికాల వారీగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం 2024లో అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. 2024 తొలి త్రైమాసికం(జనవరి-మార్చి)లో 18,499 యూనిట్లను విక్రయించగా, చివరి త్రైమాసికంలో ఈ సంఖ్య 16,664కి పడిపోయింది. 2023తో పోలిస్తే సుమారు 5 వేలకుపైగా తగ్గి 78,097 యూనిట్ల నుంచి 65,177కు దిగజారింది. గడిచిన ఐదారేండ్లలో హైదరాబాద్ కేంద్రంగా రెసిడెన్షియల్ యూనిట్ల డిమాండ్ ఏటా లక్షకు వరకు ఉందనేది నిపుణులు, రియల్ ఎస్టేట్ గణాంకాల ద్వారా వెల్లడైంది. కానీ, కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి 68 వేల యూనిట్లు విక్రయించడమే బిల్డర్లకు గగనమైంది. 2023లో అమ్ముడైన యూనిట్ల విలువ రూ.1,21,566 కోట్లుగా ఉంటే.. 2024లో రూ.113,939 కోట్లకు పడిపోయింది. ఈ లెక్కన ఏడాదిలో రూ.7 వేల కోట్లు విలువైన రెసిడెన్సియల్ ప్రాజెక్టుల క్రయవిక్రయాలు తగ్గిపోయాయి.