కోల్‌సిటీ(గోదావరిఖని), ఆగస్టు 18 : ఇరవై సంవత్సరాల క్రితం నాటి ఇంటికి ఇప్పుడు అనుమతులు లేవంటూ రామగుండం టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేయడంపై వృద్ధ దంపతులు మంగళవారం గోదావరిఖని అశోక్‌నగర్‌లోని వాటర్‌ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. మూడున్నర గంటల పాటు ట్యాంక్‌పైనే ఉన్నారు. తమకు న్యాయం జరగని పక్షంలో కిందికి దూకుతామంటూ హెచ్చరించడంతో ఉద్రిక్తత నెలకొన్నది. బాధితుల కథనం ప్రకారం… రామగుండం నగర పాలక సంస్థ 22వ డివిజన్ ఎల్కలపల్లి గేట్ ప్రాంతానికి చెందిన మీనుగు లక్ష్మి, మొగిలి దంపతులు తమకు వారసత్వంగా వచ్చిన భూమిలో 20 ఏండ్ల క్రితం ఇంటిని నిర్మించుకున్నారు. రెండు నెలల క్రితం వారు అనారోగ్యంతో హైదరాబాద్ హాస్పిటల్లో ఉండగా, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ ఇంటిని కూల్చివేశారు. దవాఖాన నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లు కూల్చివేసి ఉండటంతో హతాశయులయ్యారు.
మున్సిపల్ అధికారులను సంప్రదిస్తే అనుమతి లేదని సమాధానం చెప్పారు. 20 ఏండ్ల నుంచి మున్సిపాలిటీకి పన్నులు కడుతూనే ఉన్నామని, ఇప్పుడు అనుమతి లేదని కూల్చివేయడం సరైంది కాదని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. తమకు పరిహారం చెల్లించాలని వారం రోజులుగా మున్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయించినా మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటనపై కోర్టును కూడా ఆశ్రయించామని చెప్పారు.
ఓపిక నశించి వాటర్ ట్యాంక్ ఎక్కామని వివరించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటిని ఎలా కూల్చివేస్తారని బాధితురాలి కొడుకు, కోడలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి చేరుకొని, మున్సిపల్ టీపీఎస్ నవీన్‌ను పిలిపించి మాట్లాడారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వృద్ధ దంపతులు ఆందోళన విరమించి కిందికి దిగారు.