పాల్వంచ, మే 13 : పసికందు తలభాగం ఓ వీధిలో ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో బుధవారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. బొల్లోరిగూడెంలోని ఓ వీధిలో పసికందు తలభాగాన్ని కుక్కలు తీసుకొచ్చి పీక్కుతింటుండగా స్థానికులు గమనించారు. వెంటనే వారు అక్కడికి వెళ్లి కుక్కలను తరిమి కొట్టారు.
ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ ఎస్సై నాగరాజు.. పసికందు తలభాగాన్ని స్వాధీనం చేసుకొని ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పాల్వంచ ప్రభుత్వ దవాఖానలోని మార్చురీలో తలభాగాన్ని భద్రపరిచారు. వీధి కుక్కలు శరీర భాగాలను తిన్న తర్వాత తలభాగాన్ని ఇక్కడికి తీసుకొచ్చాయా? లేదా ఎవరైనా శిశువును చెత్త కుప్పలో వేస్తే కుక్కలు పట్టుకొచ్చాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.