ధర్మపురి, జూన్ 16 : ‘ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జాబితాలో మా పేర్లు ఉన్నాయని స్థానిక కాంగ్రెస్ నాయకులు చెప్పిన్రు. ఇప్పుడు ఫైనల్ జాబితాలో లేవంటున్నరు. మా పేర్లు ఏమైనయ్’ అంటూ జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నక్కలపేట గ్రామస్థులు ప్రశ్నించారు. మొదటి విడత ఫైనల్ లిస్టులో ఉన్న 19మందితోపాటు మరి కొందరు ఇండ్లు లేని నిరుపేదలు సోమవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇండ్లు ఉన్నవారి పేర్లు, కాంగ్రెస్ కార్యకర్తల పేర్లు మాత్రమే ఫైనల్ లిస్టులో ఉండటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి విడత 60 మంది లబ్ధిదారులతో జాబితాను సిద్ధం చేశారని, కానీ, ఈనెల 14న 41 మందికే ప్రొసీడింగ్స్ ఇచ్చారని వాపోయారు. కేవలం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సూచించిన వారికి మాత్రమే ఇండ్లు మంజూరు చేశారని, అందులో కొందరికి ఇండ్లు ఉన్నప్పటికీ మళ్లీ ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ అందించారని ఆగ్రహించారు. ఇది అన్యాయమని మండిపడ్డారు.
నేను రోజూవారి కూలీగా పనిచేసి బతుకుతున్న. మట్టిగోడలు, గూనపెంకులతో శిథిలావస్థలో ఉన్న ఇంట్లో నేను, నా భార్య, రెండేండ్ల కూతురితో కలిసి నివసిస్తున్నం. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న. అయితే మొదటి విడత లిస్టులో పేరున్నదని, ఖాళీ జాగా చూపిస్తే ఇంటిని నిర్మించి ఇస్తామని, మంత్రి వచ్చి ముగ్గుపోస్తారని అధికారులు, కాంగ్రెస్ నాయకులు పదేపదే చెప్పిన్రు. ఇది నమ్మి ఉన్న ఆ ఇంటిని కూలగొట్టుకున్న. వచ్చి ముగ్గుపోస్తరనే ఆశతో జాగాను చదును చేసి ఉంచిన. తీరా ఇప్పుడు చూస్తే లిస్టులో పేరులేదని చేతులెత్తేసిన్రు. నాకు నిలువ నీడ లేకుండా పాయె.