హైదరాబాద్, జనవరి 28(నమస్తే తెలంగాణ): పద్మశ్రీ పురస్కారం పొందిన దర్శనం మొగిలయ్యకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌లో ఇంటి స్థలం, కోటి నగదు ప్రకటించారు. మొగిలయ్య శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆయనను ఘనంగా సన్మానించారు. మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల సీఎం హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్య అభినందనీయుడని సీఎం పేర్కొన్నారు. ఇప్పటికే మొగిలయ్య కళను ప్రభు త్వం గుర్తించి, గౌరవ వేతనం కూడా ఇస్తున్నదని తెలిపారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింప జేసుకొంటూ కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని సీఎం పునరుద్ఘాటించారు. మొగిలయ్యకు హైదరాబాద్‌లో నివాసయోగ్యమైన ఇంటిస్థలం, ఇంటి నిర్మాణం, ఇతర ఖర్చుల కోసం కోటి రూపాయలు అందజేయనున్నట్టు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజును సీఎం ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.