Heavy Rains | తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లాలో గురువారం పాఠశాలలు, కళాశాలలకు భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ ప్రావీణ్య సెలవులు ప్రకటించారు. అలాగే, వికారాబాద్ జిల్లాలోని పాఠశాలకు గురు, శుక్రవారాల్లో సెలవులను ప్రకటిస్తూ ప్రతీక్ జైన్ ఆదేశాలు జారీ చేశారు. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముద్గురుచింతంపల్లి సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జిల్లావ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా నస్కల్ వాగు, బూరుగుపల్లి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పరిగి, వికారాబాద్, నస్కల్ మీదుగా రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
ఆటోలు, బస్సులు, బైక్‌లు అటువైపుగా వెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే, నల్గొండ జిల్లా త్రిపురారంలో ఐదుగంటల నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నది. సూర్యాపేట జిల్లా కోదాడలో నాలుగు గంటల నుంచి ఏకధాటిగా వర్షం పడుతుంది. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. అంతరగంగా వాగు ప్రవహిస్తున్నది. కోదాడ మండలం తొగర్రాయి, కూచిపుడి వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. రెడ్లకుంట-కూచిపూడి రహదారిపై నుంచి వాగు నీరు ప్రవహిస్తుంది. వాగు దాటేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. భారీ వర్షాల దృష్టా అధికారులు జిల్లాలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ 62814 92368 నెంబర్లో సంప్రదించాలన్నారు. మెదక్ జిల్లాలోనూ 9391942254 నంబర్‌తో కంట్రోల్ రూమ్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. వనపర్తిలో 08545-220351/233525 నంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది.