హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ (GHMC) వరిధిలో వర్షం దంచికొట్టింది. మంగళవారం వేకువజాము నుంచి కుండపోతగా వర్షం కురిసింది. ఆకాశానికి చిళ్లులు పడ్డాయా అన్నట్లుగా పలు ప్రాంతాల్లో వర్షం కుమ్మరించింది. దీంతో హైదరాబాద్లో రహదారులన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. పార్సిగుట్ట, సనత్నగర్లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వర్షపు నీటిలో కొట్టుకుపోయారు. హైదరాబాద్లో మరో రెండు గంటలపాటు భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. నగరానికి ఎల్లో అలర్ట్ జారీచేసింది.
ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షం కారణంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈవోలు ఆదేశాలు జారీచేశారు. కాగా, పంజాగుట్టలోని అపార్టుమెంట్ సుఖ్ నివాస్ అపార్టుమెంటు వద్ద పిడుగుపడింది (Lightning). షెడ్డుపై పిడుగు పడి కారు ధ్వంసమయింది. దీంతోపాటు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రజలు అవసరమైతేనే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించారు.