వైరా రూరల్, సెప్టెంబర్ 28 : విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ హెచ్ఎం ఉదంతం ఖమ్మం జిల్లా వైరా మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. పాలడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం చావా శ్రీనివాసరావు కొంతకాలంగా 8, 9, 10వ తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు వారిని బూతులు తిడుతున్నాడు. విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో గ్రామస్థులతో కలిసి శనివారం పాఠశాల వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తారనే విషయాన్ని ముందుగానే పసిగట్టిన హెచ్ఎం శ్రీనివాసరావు పాఠశాల నుంచి తప్పించుకున్నాడు. ఎంఈవో కొత్తపల్లి వెంకటేశ్వర్లు వచ్చి కార్యాలయంలో ఉపాధ్యాయులతో మాట్లాడుతుండగా ఆందోళనకారులు గదికి తాళం వేశారు. అంతటితో ఆగకుండా ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో డీఈవో సోమశేఖర శర్మ, సీఐ నూనావత్ సాగర్ పాఠశాలకు చేరుకొని తల్లిదండ్రులకు నచ్చజెప్పి.. గదిలో నిర్బంధించిన ఎంఈవో, ఉపాధ్యాయులను బయటకు తీసుకొచ్చారు. హెచ్ఎంను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేయగా, విచారణ చేపట్టి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఈవో హామీ ఇచ్చారు. ఫిర్యాదు స్వీకరించిన సీఐ సాగర్ హెచ్ఎంపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
కాలమ్-5 సవరించాలి: సీపీఎం
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో కాలమ్ నంబర్-5ను సవరించాలనిక కోరుతూ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ (సీఈవో)ను శనివారం బీఆర్కేభవన్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీజీ నరసింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు బాబూరావు వినతిపత్రం అందజేశారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ, కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గాలకు అక్టోబర్ 1 నుంచి ఓటర్ల నమోదు ప్రారంభమవుతున్నదని గుర్తుచేశారు. ఓటర్ల జాబితాలోని కాలమ్ నంబర్-5లో విద్యాసంస్థ పేరు, మండలం, జిల్లా తదితర పూర్తి పోస్టల్ అడ్రస్‌ను ప్రచురించాలని సూచించారు.