హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 24(నమస్తే తెలంగాణ) : నిధుల్లేక, ఆదాయం రాక, ప్రాజెక్టు కోసం, అభివృద్ధి పనులు మొదలుపెట్టేందుకు హెచ్ఎండీఏ అపసోపాలు పడుతున్నది. రియల్ ఎస్టేట్ రంగంపై కాంగ్రెస్ సర్కా ర్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలతో ఆదాయ వనరులను తగ్గి ఎన్నడూలేని విధంగా కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు నిధుల్లేని పరిస్థితికి దిగజారింది. ఆర్భాటంగా చేపట్టిన ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు నిధుల సమీకరణ కోసం వెంపర్లాడుతున్నది.
సిటీ బ్రాండ్ పెరిగేలా బీఆర్ఎస్ కృషి
నగరంలో ప్రాజెక్టులను చేపట్టడంలో బీఆర్ఎస్ సర్కారు క్రియశీలక పాత్ర పోషించింది. సిటీ బ్రాండ్ విలువను పెంచేందుకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు నిధులను ఏమాత్రం ఆటం కం లేకుండా సర్దుబాటు చేసింది. కానీ కాంగ్రె స్ రెండేండ్ల పాలనలో ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇబ్బంది పడుతున్నది. మెట్రో కారిడార్ మొదటి దశ, కొత్వాల్‌గూడ ఎకో పార్క్, లింక్ రోడ్ల నిర్మాణం, ఓఆర్ఆర్ చివరి దశ పనులను చకచకా పూర్తి చేసి మౌలిక వసతులను కల్పించింది. ఫలితంగానే దేశ, విదేశీ సంస్థలు పెట్టుబడులతో ముందుకొచ్చాయి.
నిధుల్లేక బాండ్లు
గతంలో ఏనాడూ హెచ్ఎండీఏ పరిధిలో ని ధులు కొరత లేదు. అవసరమైతే ఇతర సంస్థలు చేపట్టిన ప్రాజెక్టులకు కూడా అవసరా న్ని బట్టి నిధులు కేటాయించే స్థాయిలో ఉండే ది. ఈ క్రమంలోనే రాయదుర్గం-శంషాబాద్ మార్గానికి నిధులిచ్చేందుకు అంగీకరించింది. సొంత ప్రాజెక్టులను పూర్తి చేస్తూనే, ఇతర ప్రభుత్వ విభాగాలు చేపట్టే పనులకు ఆర్థిక వనరులను సమకూర్చి, నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. కానీ ఇప్పుడు దివాళా తీసిన చందంగా ప్రకటించిన వేల కోట్ల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ఏకంగా ఇన్ఫ్రా బాండ్లను విడుదల చేసుకోవాలని హెచ్ఎండీఏకు సూచించింది. గతంలో ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు హెచ్ఎండీఏ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యా యి. ఈ క్రమంలో ఇన్ఫ్రా బాండ్లను విడుదల చేసి, సర్కార్ ప్రకటించిన ప్రాజెక్టులను పట్టాలెక్కించనున్నది.
రూ.2200 కోట్లకు బాండ్లు
ఆర్థిక సంస్థలు, ప్రజల నుంచి డబ్బులు సేకరించి, వాటికి ష్యూరిటీగా బాండ్లను మం జూ రు చేయనున్నది. ఏడాది, మూడేండ్లు, ఐ దేం డ్ల కాలపరిమితితో బాండ్లను మార్కెట్లోకి తీసుకురానున్నది. వీటిని కొనుగోలు చేసిన వారికి 5-8శాతం వడ్డీ రేటు నిర్ణయించనున్నారు. ఇప్పటివరకు జీహెచ్ఎంసీలో ఈ తరహా బాండ్లు విడుదల చేసింది. అదే వడ్డీ రేటుతో ఏకంగా రూ.2,200 కోట్లను బాండ్ల రూపంలో సేకరించనున్నది.