హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 10(నమస్తే తెలంగాణ) : ఆదాయం పేరుతో వివాదాస్పద భూములకు ఎసరు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. వాటిని వేలం పేరుతో అంగడి సరుకుగా మార్చి అడ్డగోలు భూదోపిడీకి పాల్పడుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్ల నుంచి అనాలోచిత నిర్ణయాలతో వివాదాలకు తెరతీస్తున్నది. భూముల క్రయవిక్రయాల్లో కనీస నిబంధనలు, లీగల్ క్లియరెన్స్‌లను పక్కనపెట్టి, వివాదంలో ఉన్న స్థలాలపై కన్నేసింది. ఓవైపు హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలోని వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి సరిహద్దు వివాదాల్లో చిక్కుకుపోగా, మరోవైపు స్వయంగా ప్రభుత్వ సంస్థ లే అవుట్ చేసి విక్రయించిన మేడిపల్లి వెంచర్ ప్లాట్లను రాత్రికిరాత్రే నిషేధిత జాబితాలో చేర్చింది. కనీసం క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా, రెవెన్యూ అధికారుల ప్రమేయం లేకుండా, కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయాలు రియల్టీ పెట్టుబడిదారులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నది.
బంజారాహిల్స్‌లో బౌండరీ లిటిగేషన్..
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ పరిధిలోని హకీంపేట్ గ్రామ సర్వే నెంబర్ 102/1లోని 8.24 ఎకరాల అత్యంత ప్రైమ్ ల్యాండ్‌ను వేలం వేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎకరాకు కనీస ధరను రూ.99 కోట్లుగా నిర్ధారించింది. మార్కెట్లో ఎకరాకు రూ.130-150 కోట్లు పలికే ఈ స్థలం ద్వారా ఏకంగా రూ.1,200-1,500కోట్లు ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే ఈ వేలం ప్రకటన రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రంగు బయటపడింది. ఈ భూముల్లో తమకు వాటా ఉన్నదంటూ యమునానగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీతో పాటు పలు నిర్మాణ సంస్థలు అభ్యంతరం తెలిపాయి. వేలానికి పెట్టిన భూమిలో దాదాపు 4ఎకరాలు తమ సరిహద్దుల్లోకి చొచ్చుకొస్తున్నాయని ఆయా సంస్థలు హెచ్ఎండీఏ, జిల్లా రెవెన్యూ అధికారులతో పాటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాయి. జాయింట్ సర్వే నిర్వహించి, సరిహద్దులు తేల్చేవరకు వేలం ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో సుప్రీంకోర్టు దాకా వెళ్లిన ఈ భూ వివాదంలో 2009 నాటి జీవో 166 ప్రకారం తమకు దక్కిన 12 ఎకరాల్లో ఇప్పుడు ప్రభుత్వం నీలిరంగు షీట్లతో ఫెన్సింగ్ వేసి 4 ఎకరాలను అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్నదని బాధితులు వాపోతున్నారు.
నిషేధిత జాబితాలోకి హెచ్ఎండీఏ లే అవుట్
ప్రభుత్వ అనాలోచిత తీరుకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలోని సర్వే నంబర్ 62 పరిధిలో గల హెచ్ఎండీఏ లే అవుట్ తాజా ఉదాహరణగా నిలిచింది. కూడబెట్టిన డబ్బులు, అప్పులు చేసి మరీ కోట్లు పెట్టి ప్లాట్లు కొన్న సామాన్యులు ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. 230 ఎకరాల స్థలం గతంలో అటవీ శాఖ భూమిగా రికార్డుల్లో ఉన్నా.. ఆ తర్వాత డీనోటిఫై అయ్యింది. ఇందులో 56.28 ఎకరాలను అసైన్డ్ భూములుగా కేటాయించగా, సాగులో ఉన్న రైతుల నుంచి హెచ్ఎండీఏ సేకరించింది. దీనికి బదులుగా 38 మంది రైతులకు ఎకరాకు 600 గజాల చొప్పున ప్లాట్లను కేటాయించింది. మిగిలిన మొత్తం 434 ప్లాట్లు హెచ్ఎండీఏ ఖాతాలోకి చేరాయి. తొలి దశలో 85 ప్లాట్లకు వేలం వేయగా, తాజాగా మరో 68 ప్లాట్ల వేలానికి నోటిఫికేషన్ ఇచ్చారు. గజానికి కనీసం రూ.45వేలుగా నిర్ణయించి, వివాదాస్పద భూములను సామాన్యులకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. కనీసం నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చిన విషయంపై అవగాహన లేకుండా వేలం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇక తొలి విడుతలో విక్రయించిన 85 ప్లాట్లకు కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సామాన్యుల రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ల శాఖ నిలిపివేసింది. కలెక్టర్ ఆదేశాలున్నాయని సబ్ రిజిస్ట్రార్ చేతులెత్తేయడంతో వాళ్లంతా లబోదిబోమంటున్నారు.
బీఆర్ఎస్ హయాంలో టైటిల్ క్లియర్ భూములు
గత బీఆర్ఎస్ హయాంలో భూముల వేలం పారదర్శకంగా, విశ్వసనీయతను పెంచేలా జరిగింది. 100శాతం టైటిల్ క్లియర్ చేసిన తర్వాతే హెచ్ఎండీఏ లేదా టీఎస్ఐఐసీ రంగంలోకి దిగేవి. కోర్టు కేసులు, యాజమాన్య హక్కుల వివాదాలు ఉంటే పూర్తిగా పరిష్కరించాకే కొనుగోలుదారులకు కట్టబెట్టాయి. ఫలితంగా బీఆర్ఎస్ పాలనలో రియల్టీ రంగానికి స్వర్ణయుగంలా సాగింది. కోకాపేట్, ఖానామెట్, పుప్పాలగూడ, బుద్వేల్ భూముల వేలంతో దేశ విదేశాల నుంచి దిగ్గజ సంస్థలు పోటీ పడి కొనుగోలు చేశాయి. ఊహించని స్థాయిలో కోకాపేట్ నియో పోలిస్‌లోని ఎకరా ధర రికార్డు స్థాయిలో రూ.100.75 కోట్లు పలుకడం కేసీఆర్ సర్కార్ కల్పించిన నమ్మకమే. ఈ నిర్ణయాల వల్లే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వరల్డ్ క్లాస్ ప్రాజెక్టులను మార్కెట్లోకి తీసుకువచ్చాయి.
కాంగ్రెస్ నిర్ణయాలతో రియల్టీకి గొడ్డలిపెట్టు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలతో రెండున్నరేండ్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా విశ్వసనీయతను కోల్పోతున్నది. భూముల వేలం ద్వారా సొమ్ము చేసుకోవాలనే చూస్తున్నారే తప్ప.. వివాదాస్పద భూములపై నోరు మెదపడం లేదు. లిటిగేషన్ ఉన్న స్థలాలను వేలంలో కట్టబెట్టడం వల్ల బయ్యర్లు ఇరుక్కుపోయే పరిస్థితి ఉన్నది. ఈ తరహా వివాదాస్పద భూములను వేలం వేసి హైదరాబాద్ ఇమేజ్ను, రియల్టీ క్రెడిబులిటీని కాంగ్రెస్ ప్రభుత్వం తన అనాలోచిత నిర్ణయాలతో మంటగలిసేలా చేస్తున్నదనే అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం అడ్డగోలు దందాలు ఆపి, వివాదాల్లేనివి మాత్రమే మార్కెట్లోకి తేవాలని, సామాన్య కొనుగోలుదారులకు రక్షణ కల్పించాలని డిమాండ్ వినిపిస్తున్నది.
కాంగ్రెస్ పాలనలో అన్నీ భూ వివాదాలే..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేండ్ల కాలంలో భూ వివాదాలకు మళ్లీ జీవం పోస్తున్నదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ధరణిని కాలరాసిన సర్కార్ భూభారతి పేరిట విచక్షణ లేకుండా రెవెన్యూ వివాదాలకు తెరతీస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ఎక్కడచూసినా భూముల పంచాయితీలే ఉండటం చర్చనీయాంశమైంది. ఖానామెట్‌లో వెయ్యి కోట్ల విలువైన భూమి ల్యాండ్ గ్రాబింగ్ వివాదం కూడా ప్రభుత్వ పెద్దల అండదండలతోనే జరిగిందనే ఆరోపణలున్నాయి. కోర్టులు జోక్యం చేసుకుంటే గానీ ఆక్రమణలను సర్కార్ అడ్డుకోలేకపోయింది. నగర శివారులోని శంషాబాద్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో ఉన్న వేలాది ఎకరాల అసైన్డ్, సీలింగ్ భూములపై వరుసగా వివాదాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
కేవలం వీటిని వేలంతో మార్కెట్లోకి తీసుకోవాలని ఓ వైపు భావిస్తూనే, మరోవైపు సర్కార్ పెద్దల కేంద్రీకృతంగా ఈ వివాదాలు సాగుతున్నాయి. బాలానగర్‌లో ఐడీపీఎల్‌కు కేటాయించిన 14 ఎకరాల భూములను టీజీఐఐసీ వేలం వేయాలని భావించింది. కానీ ఈ భూములను 1961లోనే ఐడీపీఎల్‌కు ఇచ్చినట్టు తేలింది. కానీ కాంగ్రెస్ సర్కార్ ఇటీవలే వేలానికి సిద్ధం కాగా, తలెత్తిన వివాదంతో వెనక్కి తగ్గింది. ఇక కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూములను రిజర్వ్ ఫారెస్ట్‌గా నిర్ధారించాలని వాటా ఫౌండేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఈ భూములను టీజీఐఐసీ ద్వారా వేలానికి సిద్ధమైంది. వేలం వేయాల్సిన 8 ఎకరాల కోకాపేట నియోపోలిస్ భూములను లీజు ప్రాతిపదికన హెచ్ఎండీఏ ఓ మైనింగ్ సంస్థకు కట్టబెట్టింది. దాదాపు 25ఏండ్ల పాటు వీటిని వేలం వేయడానికి వీల్లేకుండా పోయింది. అయితే ఈ వివాదంతో వేలం ద్వారా వచ్చే వందల కోట్లను విలువైన భూములను ప్రభుత్వ పెద్దల అండదండలతో ఆ మైనింగ్ సంస్థకు కేటాయించినట్టు తెలుస్తున్నది.