పాలకుర్తి రూరల్, మే 27: జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలోని రాములోరి గుట్టపై శాతవాహనుల కాలం నాటి ఆనవాళ్లను గుర్తించినట్టు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి తెలిపారు. శాతవాహనులకు విదేశాలతో వాణిజ్య సంబంధాలున్నట్టు తమ పరిశీలనలో తేలిందని చెప్పారు. శనివారం ఆయన వల్మిడి గుట్టను సందర్శించి.. వాల్మీకి గుట్ట, మునుల గుట్ట, పెద్దమ్మ బండ కేంద్రంగా కొనసాగిన 3 వేల ఏండ్ల కిందటి సుసంపన్నమైన బృహత్ శిలాయుగం, శాతవాహనుల కాలం నాటి సంస్కృతికి సంబంధించిన అనేక ఆధారాలను కనుగొన్నారు.
రామాలయం ఉన్న గుట్ట నుంచి మంచుప్పుల వెళ్లే దారికి రెండు వైపులా విశాలమైన పాటిమీద దుబ్బ అని పిలిచే ప్రాం తం ఉంది. రాముడి గుట్టను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్న క్రమంలో ఎత్తైన రోడ్డు మార్గం వేయడానికి రెండు వైపులా కందకాలు తవ్వారు. ఈ త వ్వకాల్లో రోడ్డుకిరువైపులా అనేక మృణ్మయ పా త్రలు(మట్టిపాత్రలు) బయటపడ్డాయి. జనగా మ జిల్లాలోని అనేక గ్రామాల్లో శాతవాహనుల కాలం నాటి ఇటుకలు లభించాయి. క్రీ.పూ. 1, 2 శతాబ్దాల నాటికే రోమన్లతో వర్తక, వాణిజ్య సంబంధాలు పతాక స్థాయికి చేరినట్టు తమ పరిశీలనలో తేలిందని రత్నాకర్‌రెడ్డి పేర్కొన్నారు.