ఖలీల్‌వాడి మే 8: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ రావణాసురుడు అని సొంత పార్టీ నేతలే సంచలన ఆరోపణలు చేశారు. నిజామాబాద్‌ను లంకలా ఏర్పాటుచేసుకొని దాడులు, హత్యాయత్నాలకు పాల్పడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం నిజామాబాద్ ప్రెస్‌క్లబ్‌లో బీజేపీ సీనియర్ నాయకుడు మీసాల శ్రీనివాసరావు, కార్పొరేటర్ సవిత తదితరులు మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీచేస్తున్న ఎంపీ అర్వింద్‌కు ఓటు వేయొద్దని ప్రజలను కోరారు. ఆ కేడీని ఓడించాలని అన్నారు. బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి దించడానికి కారణం ఈ దుర్మార్గడేనని వ్యాఖ్యానించారు. మేయర్‌ను చేస్తానని చెప్పి అర్వింద్ తమ వద్ద రూ.4 కోట్లు తీసుకుని, చివరి నిమిషంలో వేరే వాళ్ల పేర్లు తెర మీదకు తీసుకొచ్చారని మండిపడ్డారు. అర్వింద్ కంటే డేరాబాబా, నిత్యానంద చాలా మంచివాళ్లు అని వెల్లడించారు.
రాజకీయ వ్యభిచారి అయిన అర్వింద్ కారణంగా పార్టీ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని బీజేపీ పెద్దలను హెచ్చరించారు. ఎంతో మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ముఖ్య కార్యకర్తలను ముప్పుతిప్పలు పెడుతున్నారని, ఆయనకు బదులు వేరే వాళ్లకు టికెట్ ఇస్తే ఈజీగా గెలిచే వారని తెలిపారు. మీసాల చంద్రయ్య అనే ఇన్చార్జిపై దాడి చేసి, హత్యాయత్నం చేయించిన వ్యక్తి అర్వింద్ అని విమర్శించారు. ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, రాకేశ్‌రెడ్డిని అసలే పట్టించుకోడని.. అమిత్ షా పర్యటనలో ఎమ్మెల్యే ధన్‌పాల్‌ను అవమానించారని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా నిజామాబాద్‌ను అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. అర్వింద్ అహంకారి అని, మీడియాను సైతం దూషించారని వెల్లడించారు. తెలంగాణ కోసం అందరూ కొట్లాడుతున్న సమయంలో అర్వింద్ మీడియాపై గన్ తీశారని గుర్తుచేశారు. కోరుట్లలో ఓడిపోయిన అర్వింద్‌కు చీమునెత్తురు లేదని, డీ అర్వింద్ అంటే దుర్మార్గపు అర్వింద్ అని ఎద్దేవా చేశారు. ‘బీసీ అయిన నువ్వు కోరుట్లలో ఓడిపోయావంటే ఎలాంటి వాడివో అర్థం చేసుకో’ అని హితవు పలికారు.