మెదక్/కొల్చారం, మే 14: కోలాచలం మల్లినాథ సూరి తెలుగు కవి, సంస్కృత పండితుడు, విమర్శకుడు. 14వ శతాబ్దానికి చెందిన పండితుడు. కాకతీయ రాజుల ఆదరణలో ఓరుగల్లు చేరారు. కాకతీయ రాజుల పతనం తర్వాత రాచకొండ రాజుల ఆస్థానానికి వచ్చారు. రాచకొండ రాజైన సింగభూపాలుడు, విజయనగరాన్ని పాలించిన ప్రౌఢ దేవరాయలు కాలంవారని చరిత్ర చెప్తున్నది. క్రీస్తుశకం 1350 నుంచి 1430 మధ్య జీవించినట్టు ఆయన రచనల ద్వారా తెలుస్తున్నది. మల్లినాథ సూరి లేకుంటే కాళిదాసు అంతటి మహాకవి ప్రపంచానికి తెలిసేవాడు కాదు. క్లిష్టమైన వ్యాఖ్యాన ప్రక్రియకు ప్రాణం పోసి సంస్కృత పంచ మహా కావ్యాలైన రఘువంశం, మేఘ సందేశం, కుమార సంభవం, కిరాతార్జునీయం, హర్షనైషధం గ్రంథాలకు తన సంజీవని వ్యాఖ్యానంతో కాళిదాసు సాహిత్యాన్ని చిరస్మరణీయం చేసిన గొప్ప విద్వాంసుడు మల్లినాథ సూరి. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని కొల్చారం కోలాచల మల్లినాథ సూరి స్వగ్రామం.
పశువుల కాపరి నుంచి ప్రపంచ ప్రఖ్యాతుడిగా..
బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కోలాచల మల్లినాథ సూరి తండ్రి, తాత పండితులే. మల్లినాథుడికి చదువు అబ్బకపోవడంతో కుటుంబ సభ్యులు పశువులు కాసేందుకు పంపేవారు. గ్రామానికి సమీపంలోని (ప్రస్తుతం బస్టాండ్ సమీపంలోని) తిరుమలయ్యగుట్టపై త్రికాలజ్ఞాని ఉన్నాడని తెలిసి మల్లినాథ సూరి నిత్యం అక్కడికి వెళ్లి సపర్యలు చేసేవారు. యోగి అవసాన దశలో మల్లినాథ సూరిని పిలిచి మంత్రోపదేశం చేసి నాలుకపై బీజాక్షరాలు లిఖించినట్టు చరిత్ర చెప్తున్నది. దీంతో మల్లినాథ సూరి ఏడుపాయల వనదుర్గాదేవి సాక్షాత్కారం పొంది, అక్కడి నుంచి కాశీ వెళ్లారు. ఆ తర్వాత ఆయన వారణాసికి వెళ్లి కాశీ విశ్వనాథుడిని దర్శించుకొని, అక్కడ ఓ గురువు వద్ద సర్వశాస్ర్తాలు నేర్చుకొన్నారు. మొత్తం 19 శాస్ర్తాల్లో ప్రావీణ్యం సాధించి మహాభాష్యకర్తగా, విద్యాసారంగతుడిగా కీర్తి పొందారు.
మల్లినాథ సూరి పొందిన బిరుదులివే..
మల్లినాథ సూరి సంస్కృత పంచ మహా కావ్యాలను విద్యార్థులకు క్రమ పద్ధతిలో బోధించారని చరిత్ర చెప్తున్నది. కాళిదాసు రచించిన ప్రథమ కావ్యం రఘువంశం బోధించి సదాచారాలు, ధర్మరక్షణ నేర్పి ఉత్తమ సంస్కారులుగా తీర్చిదిద్దారు. ఎంతోమంది విద్యార్థులకు సాహితీ పాఠాలు చెప్పడంతో ‘మహా మహోపాధ్యాయ’ అనే బిరుదు పొందారు. కాళిదాసు రచనలకు వ్యాఖ్యానాలు రాయడం ద్వారా ‘వ్యాఖ్యాన చక్రవర్తి’, వ్యాకరణం, తర్కం, మీమాంస అనే మూడు శాస్ర్తాల్లో పారంగతుడు కావడంతో ‘పదవాక్య పారావార పారీణుడు’ అనే బిరుదులు లభించాయి. వారణాసిలోని బెనారస్ యూనివర్సిటీలో మల్లినాథ సూరి పేరిట పీఠం ఉందంటే ఆయన ఎంతటి గొప్పవారో తెలుస్తున్నది.
1981లో కొల్చారంలో మల్లినాథ సూరికి విగ్రహం
మెదక్ మండల పరిషత్, జిల్లా సాంస్కృతిక మండలి సంయుక్త ఆధ్వర్యంలో 1981, నవంబర్ 21న మల్లినాథ సూరి స్వస్థలమైన కొల్చారంలో మొట్టమొదటి స్మారకోత్సవ సభ జరిగింది. ఈ సభకు శాస్ర్తుల విశ్వనాథశర్మ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా నాటి మంత్రి శ్రీరామమూర్తి, కలెక్టర్ గాయత్రి రామచంద్రన్ హాజరై.. గ్రామ ప్రజలకు మల్లినాథ సూరి గొప్పతనం గురించి తెలియజేశారు. కొల్చారంలోని మల్లినాథసూరి వంశస్థుల ఇంటిని 1981లో అప్పటి ప్రభుత్వం రూ.18 వేలకు కొనుగోలు చేసింది. ఆయన స్మారకార్థం ఆ ఇంట్లో వేద పాఠశాల, గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని సంకల్పించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. 2006లో ‘శ్రీకోలాచల మల్లినాథ సూరి సాహితీపీఠం’ ఏర్పడింది. అప్పటి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు సౌజన్యంతో మల్లినాథ సూరి విగ్రహాన్ని తయారు చేయించి, స్థానిక గ్రంథాలయం ఎదుట ఏర్పాటు చేశారు. 2012 సెప్టెంబర్ 9న మల్లినాథ సూరి వైభవ సభ ఏర్పాటు చేశారు.
ఆ సమావేశానికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి, ప్రస్తుత రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, ప్రస్తుత మంత్రి తన్నీరు హరీశ్‌రావు హాజరై, మల్లినాథ సూరి గొప్పతనాన్ని మరోసారి చాటారు. 2017 డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో మెదక్ జిల్లాలో తెలుగు మహాసభల ప్రారంభ కార్యక్రమాన్ని కొల్చారంలో నిర్వహించారు. తాజాగా, సీఎం కేసీఆర్ రాష్ర్టావతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ విధివిధానాలపై ఉన్నత స్థాయి సమీక్షలో ప్రసిద్ధ కవి మల్లినాథ సూరి జన్మస్థలమైన మెదక్ జిల్లా కొల్చారంలో ‘మల్లినాథ సూరి సంస్కృత విశ్వవిద్యాలయం’ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మహామహోపాధ్యాయకు ముఖ్యమంత్రి కేసీఆర్ అరుదైన గౌరవం దక్కేలా చేశారు. దీంతో సూరి స్వగ్రామం కొల్చారంలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకప్పటి ‘కొలిచెలమ’నే నేటి ‘కొల్చారం’
భారతీయ సాహిత్య చరిత్రలో తనదైన ముద్ర వేసిన కోలాచల మల్లినాథ సూరిది మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని కొల్చారం మండల కేంద్రం. చారిత్రాత్మక మెదక్ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలిచలమ గ్రామమే కాలాంతరంలో కోలాచలంగా, కొల్చారంగా రూపాంతరం చెందింది. ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి చేరువలో ఉంటుందీ కొల్చారం గ్రామం. ఏడుపాయల అమ్మవారి ఆలయ చరిత్ర గ్రంథంలో మల్లినాథ సూరి ప్రస్తావన ఉండడం విశేషం. ఇప్పుడు సంస్కృత వర్సిటీ ఏర్పాటుతో మల్లినాథ సూరి స్వగ్రామమైన కొల్చారం రూపురేఖలే మారిపోనున్నాయి.
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు..
ప్రసిద్ధ కవి మల్లినాథ సూరి జన్మస్థలమైన మెదక్ జిల్లా కొల్చారంలోని కోలాచల మల్లినాథ సూరి సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షనీయం. మహామహోపాధ్యాయ మల్లినాథ సూరికి అరుదైన గౌరవం దక్కింది. శ్రీ కోలాచల మల్లినాథ సూరి సాహితీ పీఠం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు.
-జగదీశ్చంద్ర, అధ్యక్షుడు, శ్రీకోలాచల మల్లినాథ సూరి
సాహితీ పీఠం, కొల్చారం (మెదక్ జిల్లా)
రాష్ట్రంలోని వర్సిటీల ప్రత్యేకత
యూనివర్సిటీ : ప్రత్యేకత
తెలంగాణ మహిళా వర్సిటీ : మహిళా విద్యకు ప్రోత్సాహం
జవహర్‌లాల్‌నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ : ఆర్ట్ అండ్ కల్చర్, ఫొటోగ్రఫీ
ఫారెస్ట్ యూనివర్సిటీ : అడవుల పెంపకం, అటవీ సంపదవృద్ధి
పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ : తెలుగు భాష పరిరక్షణ, కళలు, సంస్కృతులపై కోర్సులు
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ : దూర విద్య, సార్వత్రిక విద్య
జేఎన్టీయూ : సాంకేతిక విద్య, టెక్నికల్ కోర్సులు
కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ : పండ్లతోటలు, పూల తోటలపై పరిశోధన
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ : వ్యవసాయ సంబంధ అంశాలపై రిసెర్చ్, కోర్సుల నిర్వహణ
పీవీ నర్సింహారావు వెటర్నరీ వర్సిటీ : పశుసంపద,మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై రిసెర్చ్
కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ : వైద్య రంగం
జాతీయస్థాయి విద్యాసంస్థలు
అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ వర్సిటీ : ఉర్దూ, అరబిక్ భాషల్లో కోర్సులు
నల్సార్ వర్సిటీ : న్యాయ విద్యలో కోర్సుల నిర్వహణ
ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ వర్సిటీ : ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్సహా విదేశీ భాషల బోధన
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ : మేనేజ్మెంట్, బిజినెస్ సంబంధ కోర్సుల నిర్వహణ
ఐఐటీ, ట్రిపుల్ ఐటీలు : సాంకేతిక విద్య