SSC Exam | మంచిర్యాల, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒక ప్రశ్నపత్రానికి బదులు మరో ప్రశ్నపత్రం పంపిణీ చేయడంతో పదో తరగతి తెలుగు పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా జరిగిన ఘటన మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. పరీక్ష ప్రారంభానికి ముందు ట్రంక్ బాక్స్‌లో వచ్చిన ప్రశ్నపత్రాలను సీఎస్ ఓపెన్ చేసి చూడగా డే-1(తెలుగు) పరీక్ష పత్రాలకు బదులు డే-2(హిందీ) ప్రశ్నపత్రాలు వచ్చినట్టు గుర్తించారు.
డీఈవో యాదయ్య కలెక్టర్ కుమార్‌దీపక్‌కు సమాచారం అందించారు. పరీక్ష కేంద్రానికి చేరుకున్న కలెక్టర్ ఆరా తీశారు. పరీక్ష కేంద్రానికి వచ్చిన డే-2 ప్రశ్నపత్రాలను తిరిగి పోలీస్ స్టేషన్లో అప్పగించి, డే-1 పేపర్‌ను తీసుకొచ్చి పరీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పేపర్ లీకేజీ వార్తలను ఖండించారు. మంచిర్యాల పీఎస్ నుంచి 9 సెంటర్లకు ప్రశ్నపత్రాలు వెళ్లాయని, ఇందులో ఒక సెంటర్‌కు వచ్చిన ట్రంక్ బాక్స్‌లో డే-1 పేపర్‌కు బదులు డే-2 పేపర్ పంపించారని వెల్లడించారు. పొరపాటు చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.