హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆయన కుమారుడు హిమాన్షు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. యానిమల్ సినిమాలోని ‘నాన్న’ పేరిట ఉన్న ‘నా సూర్యుడివో… నా చంద్రుడివో..’ పాటను సొంత గాత్రంతో ఆలపించారు. ఈ పాటను కేటీఆర్ ఎక్స్ ఖాతాలో శనివారం పోస్టు చేశారు. కేటీఆర్, హిమా న్షు తీపి గుర్తులకు సంబంధించిన ఫొటోలతో ఓ వీడియో రూపొందించి పాటను జోడించారు. యానిమల్ సినిమాలోని ఒరిజినల్ పాటకు ఏ మాత్రం తగ్గకుం డా హిమాన్షు గాత్రం కుదిరింది. హిమా న్షు ఈ పాటను జూలైలోనే తన పుట్టిన రోజు సందర్భంగా రికార్డు చేసి ఉంటాడని కేటీఆర్ అన్నారు. కానీ అప్పుడున్న పరిస్థితుల వల్ల హిమాన్షు ఆ పాటను బయటకు విడుదల చేయలేదేమోనని అభిప్రాయపడ్డారు. ‘వారం క్రితమే మొదటిసారి ఈ పాటను విన్నాను. ఈ కష్టతరమైన సంత్సరంలో నాకు ఉత్తమమైన బహుమతి. థ్యాం క్యూ బింకు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. హిమాన్షుకు తండ్రిగా గర్వపడుతున్నానని చెప్పారు. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘గుడ్ సన్.. గుడ్ ఫాదర్’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అని హిమాన్షును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఒరిజినల్ పాటకు ఏమాత్రం తగ్గలేదని ట్వీట్లు చేస్తున్నారు.
శభాష్.. హిమాన్షు: ఎంపీ వద్దిరాజు
కేటీఆర్ కోసం తనయుడు హిమాన్షు పాట పాడి ప్రేమను చాటుకోవడంపై బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అభినందించారు. తండ్రిపై తనకున్న ప్రేమాభిమానాలు, గౌరవాన్ని పాట రూపంలో ఆవిష్కరించడం పట్ల శనివారం ఒక ప్రకటనలో ఆశీస్సులు అందజేశారు.