సగటు రహదారి సాంద్రత ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 96 కిలోమీటర్లు
హైదరాబాద్లో ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 4,154 కిలోమీటర్లు
హైదరాబాద్, ఫిబ్రవరి 23 : రాష్ట్రంలో రహదారులు గణనీయంగా అభివృద్ధి చెందాయి. స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని విభాగాల రహదారులు 1,07,871.2 కిలోమీటర్ల మేర ఉన్నాయి. ఇందులో జాతీయ రహదారులు 3.6 శాతం ఉండగా, రోడ్లు, భవనాలశాఖ నిర్వహించే రాష్ట్ర రహదారులు 25.7 శాతం, పంచాయతీరాజ్ రహదారులు 62.4 శాతం, గ్రేటర్ హైదరాబాద్ రహదారులు 8.4 శాతం ఉన్నాయి. ఈ రహదారుల్లో 9.9 శాతం సిమెంట్ రోడ్లు కాగా, 52.6 శాతం డాంబర్ రోడ్లు, 8.5 శాతం కంకర రోడ్లు, 29.0 మట్టి (నాన్మెటల్) రోడ్లు ఉన్నాయి. సగటు రహదారి సాంద్రతను పరిశీలిస్తే ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 96 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 100 చదరపు కిలోమీటర్లకు 4,154 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా మినహా అన్ని జిల్లాల్లో కలిసి 3,910 కిలోమీటర్ల 23 జాతీయ రహదారులు ఉన్నాయి. జీహెచ్ఎంసీలో ఉన్న 9,013 కిలోమీటర్ల రోడ్లలో 2,846 కిలోమీటర్లు బీటీ, 6,167 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఉన్నాయి.
గ్రామాల్లో 27 వేల కిలోమీటర్ల డ్రైనేజీలు
గ్రామీణ ప్రాంతాల్లో 27,287 కిలోమీటర్ల మురు గు కాలవలు ఉండగా ఇందులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 2,213 కిలోమీటర్లు, ఓపెన్ డ్రైనేజీ 19,316 కిలోమీటర్లు, కచ్చ డ్రైనేజీ 5,756 కిలోమీటర్ల మేర ఉన్నాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 1,816 కిలోమీటర్లు, అతి తక్కువగా ములుగు జిల్లాలో 354 కిలోమీటర్ల మేర డ్రైనేజీలు ఉన్నాయి.