హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వర్షం (Heavy Rain) దంచికొడుతున్నది. శనివారం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తున్నది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకున్నది. పాకాల చెరువుతోపాటు మరికొన్ని తెగిపోయాయి. కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి, ఇంటికన్నె మధ్య ఎగువ, దిగువ మార్గాల్లో రైల్వేట్రాక్ కింద కంకర కొట్టుకోయింది. దీంతో మట్టి కోతకు గురవడంతో ట్రాక్ కింది నుంచి వరద ప్రవహిస్తుండటంతో విజయవాడ- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం లక్కవరంలో అత్యధికంగా 29.98 సెంటీమీటర్ల వర్షంపాతం నమోదయింది.
ఇక రాష్ట్రవ్యాప్తంగా చూస్తే.. మహబూబాబాద్ జిల్లా ఇంగుర్తిలో 29.8 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా చిలుకూరులో 29.7 సెం.మీ., మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో 29.6 సెం.మీ., ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో 29.6 సెం.మీ., మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లిలో 29.4 సెం.మీ., మరిపెడలో 29.1 సెం.మీ., కురవిలో 28.6 సెం.మీ., చినగూడులో 28.5 సెం.మీ., సూర్యాపేట జిల్లా మట్టంపల్లిలో 28 సెం.మీ., మద్దిరాలలో 27.7, వరంగల్ జిల్లా పర్వతగిరిలో 26.6 సెం.మీ., మహబూబాబాద్‌లో 26.6 సెం.మీ., వరంగల్ జిల్లా నెక్కొండలో 25.9, సూర్యాపేటలోని మోతెలో 25.9 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదయింది.