సూర్యాపేట, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ఈ సీజన్లో పెసర్లకు అత్యధిక ధర పలుకుతున్నది. దేశంలో పప్పులకు డిమాండ్ పెరగడంతో మద్దతు ధరను మించిపోతున్నది. వారం రోజులుగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో పెసర్లకు దేశంలోనే అత్యధిక ధర వస్తున్నది. వారంకిందట క్వింటాల్ పెసర్లకు రూ.7,600 పలుకగా, సోమవారం దేశంలోనే అత్యధికంగా రూ.7,859 ధర వచ్చింది. ఈ నేపథ్యంలో వరి సాగు కంటే పప్పు ధాన్యాల సాగే మేలు అని రైతులు పేర్కొంటున్నారు.
జాతీయ మార్కెట్లను దాటి..
సాధారణంగా జాతీయస్థాయిలో పెసర్లకు రాజస్థాన్‌లోని జైపూర్ మార్కెట్, మహారాష్ట్రలోని అకోలా, సోలాపూర్, కర్ణాటకలోని గదగ్, గుల్బర్గ, రాయ్‌చూర్ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ సీజన్లో ఆయా మార్కెట్లను మించి సూర్యాపేటలో అధిక ధరలు నమోదవుతున్నాయి. ఆయా మార్కెట్లలో క్వింటాల్‌కు రూ.6,900 నుంచి రూ.7,200 వరకు పలికింది.
పంట మార్పిడితో ఫలితం
సీఎం కేసీఆర్ చెబుతున్నట్టు పంట మార్పిడి చేసే రైతులకు మంచి ఫలితం కనిపిస్తున్నది. ఈ సీజన్లో వరి వేసిన రైతుల కంటే ఆరుతడి పంటలు సాగుచేసిన వారికి అధిక లాభం వచ్చింది. సూర్యాపేటలో పెసర, కంది పంటల రైతులకు మద్దతు ధరకు మించి దక్కుతున్నది. ఈ సీజన్లో సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 8,860 ఎకరాల్లో పెస ర, 4,600 ఎకరాల్లో కంది సాగు చేశారు. క్వింటాల్ పెసర్ల కు మద్దతు ధర రూ.7,275ను మించి మరో రూ.600 అధికంగా లభిస్తున్నది. రంగు మారిన పెసలు క్వింటాల్‌కు రూ.3వేల నుంచి రూ.3,500 వరకు పలుకుతున్నది.