హైదరాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ) : డిగ్రీలోని బీఏ, బీకాం కోర్సులకు కొత్త కరికులం రూపకల్పనకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కసరత్తు కొలిక్కి వచ్చింది. 2024 -25 విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని 21 అటానమస్ కాలేజీల్లో ఈ కరికులాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా అమలుచేయాలని నిర్ణయించింది. సోమవారం మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి ఈ కొత్త కరికులం అమలుపై సమీక్షించారు.
బీఏ (హెచ్ఈపీ), బీకాం (ఫైనాన్స్) కోర్సులకు నూతన కరికులాన్ని సిద్ధం చేశారు. విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచడం, ఉద్యోగాలను సిద్ధం చేయడంలో భాగంగా అబెరిస్ట్విత్, బంగోర్ వేల్స్ వర్సిటీల సహకారంతో ఈ కరికులాన్ని అభివృద్ధిచేశారు. కోర్సుల్లో అంతర్భాగంగా ఇంటర్న్‌షిప్, ప్రాజెక్ట్‌లను అమలుచేస్తారు. ఈ నెల 16న వర్చువల్‌గా వేల్స్ విశ్వవిద్యాలయాల నిపుణులు మన ఫ్యాకల్టీకి అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత ఫ్యాకల్టీకి ప్రత్యేకంగా శిక్షణనిస్తారు. సమావేశంలో వీసీలుడీ రవీందర్,విజ్జులత, ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, కరికులం డైరెక్టర్ ఉషాకిరణ్ తదితరులు పాల్గొన్నారు.