రక్తం సలసల మరిగే దృశ్యం!
పండ్లు పటపట కొరికే దృశ్యం!
విపక్ష నేత నివాసం మీద రక్కసిమూకల విశృంఖల వీరంగం!
దానికి ప్రభుత్వ తోడ్పాటు!..
పోలీసు బలగాల వత్తాసు..!
బరితెగించిన గూండాలకు
ప్రజల చేతిలో బడితెపూజ!

ఏమిటిది? ఎందుకిట్లవుతున్నది?
ఒకనాటి సీమ ఫ్యాక్షనిజాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు దిగుమతి చేస్తున్నదా? దాడికి దిగింది ఎవరి మీద? తెలంగాణ కోసం 14 ఏండ్లు ఎత్తిన జెండా దించని ఉద్యమనేత మీద! సాధించిన రాష్ట్రంలో వందేండ్ల ప్రగతి బాటలు పరిచిన దార్శనికుడి మీద!
ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంపై దాడి చేసేందుకు కాంగ్రెస్ మూకలు
చేసిన ప్రయత్నాలను.. ప్రజలే పెట్టనిగోడలా అడ్డుకున్నారు. తమ నేత కోసం ఊరూరా రోడ్లమీదికి వచ్చారు.
వచ్చిన గూండాలను వచ్చినట్టు పల్లెపల్లెనా అడ్డుకున్నారు. చీపుర్లు, చెప్పులతో వారిని తరిమికొట్టారు.
పోలీసులు సహకరించినా, ప్రజలు ప్రతిఘటించడంతో ముష్కర మూకలు తోకముడిచాయి.
ఇవాళ ఏమిటి? రాష్ట్రంలో కరెంటు లేదు. పంటకు నీళ్లు లేవు. యూరియా దొరుకడం లేదు. పైర్లు ఎండిపోతుంటే రైతులు విలపిస్తు న్నారు. విద్యార్థులకు రీయింబర్స్మెంట్ లేదు. 22ఏ జీవో పుణ్యమా అని కోటి ఎకరాల భూమి పట్టాదారులు బోరుబోరు మంటున్నరు. ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు దండగమారి సర్కార్ మీద దండుకట్టి కొట్లాడుతున్నరు. సభలో ఇవేవీ చర్చకు రాకూడదని.. అలవాటైన దాడులు, డైవర్షన్లకు దిగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న విపక్ష ఎమ్మెల్యేలను సభకే రానివ్వలేదు. నిన్న తెల్లారకముందే అరెస్టులు.. విపక్షనేత నివాసం మీద పైశాచిక దాడులు. మూడు వైపులనుంచి ముప్పేట దాడికి దిగిన ముష్కర మూకలు; ప్రజలు తిరగబడి చితకబాదితే దొరికిన దిక్కుకు పారిపోయారు.
తెలంగాణ బాంచెన్ అంటది.. బడితెలు పడుతది.
కన్నూమిన్నూ కానక విర్రవీగితే వీపులు సాపు చేస్తది
ముందున్నది ముసళ్ల పండుగ. తస్మాత్ జాగ్రత్త!!

(ఎర్రవల్లి నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి): అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని నేరుగా ఎదురొనే దమ్ములేక, హామీలపై నిలదీస్తున్న గులాబీ దళానికి రాజకీయంగా బదులు ఇవ్వలేక రేవంత్ ప్రభుత్వం ప్రత్యక్ష దాడులకు దిగింది. మొన్న అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన రేవంత్‌రెడ్డి బలగం.. మంగళవారం మరో దారుణానికి ఒడిగట్టింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పదేండ్లపాటు ప్రగతి పథంలో నడిపించిన ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంపై దాడికి తెగబడే దుస్సాహసం చేసింది.
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అధికారిక క్యాంప్ కార్యాలయం నుంచే వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల ముసుగుతో కిరాయి మూకలు దాడికి వాహనాల్లో బయలుదేరారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, గజ్వేల్ నేత నర్సారెడ్డి వంటి కాంగ్రెస్ నాయకులు బాహాటంగా రౌడీషీటర్లను వెంటేసుకొని ఈ దాడి యత్నానికి నాయకత్వం వహించారు. కేసీఆర్ నివాసానికి వెళ్లే మార్గాల్లో 144 సెక్షన్ విధిస్తున్నామని ప్రకటించిన పోలీసులు, కాంగ్రెస్ గూండాల వాహన శ్రేణులకు మాత్రం పచ్చజెండా ఊపడమే గాక స్వయంగా దారి చూపిస్తూ ఎసార్ట్తో సాగనంపడం ప్రజలను నివ్వెరపరిచింది.
జరుగబోతున్న కుట్రను పసిగట్టిన ఎర్రవల్లి చుట్టుపక్కల పల్లెలు అప్రమత్తం అయ్యాయి. కేసీఆర్ నివాసం మీదికి దాడికి వెళ్తున్నాయని పసిగట్టిన ప్రజలు ఇండ్ల నుంచి బయటికి వచ్చారు. నిమిషాల్లో చౌరస్తా వద్ద గుంపై, ఏ ఊరుకు ఆ ఊరు ఉప్పెనలా కదిలి పొలిమేరలో కాపు కాశారు. వారికి బీఆర్ఎస్ శ్రేణులు కూడా తోడయ్యాయి. కర్ర, కట్టె, పొరక, చెప్పు, రాయి ఏది దొరికితే అది అందుకొని రౌడీ మూకలను పొలిమేర దాటించారు. ప్రజల ఎదురుదాడిని చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోవటం గమనార్హం.

ఉత్తరం దిక్కు నేత దవాఖాన పాలు
ఉత్తరం దిక్కు నుంచి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నాయకత్వంలో దాదాపు 500 మంది ప్రజ్ఞాపూర్ మీదుగా వరదరాజపూర్ చౌరస్తా వరకు వాహనాల్లో తరలివచ్చారు. సోమవారం రాత్రే గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కరీంనగర్ నుంచి ప్రత్యేకంగా రౌడీ షీటర్లను రప్పించినట్టు చెప్తున్నారు. వరదరాజపూర్ నుంచి దాదాపు 2 కిలోమీటర్లు పాదయాత్ర చేసి శివారు వెంకటాపూర్ గ్రామానికి చేరుకున్నారు. అక్కడినుంచి కేసీఆర్ నివాసం కేవలం 1.5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది.
నర్సారెడ్డి కేసీఆర్ నివాసం వైపు పాదయాత్రగా వస్తున్నారనే వార్త తెలియటంతో వెంకటాపూర్ గ్రామస్తులు పోగయ్యారు. ఆగ్రహంతో చౌరస్తాలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను తగులబెట్టారు. వెనక్కి వెళ్లిపోవాలని హెచ్చరించినా నర్సారెడ్డి మొండిగా దూసుకురావడంతో గ్రామస్తులు వారిని అడ్డగించారు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయనీయకుండా దాదాపు గంటపాటు చౌరస్తాలోనే నిలువరించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో నర్సారెడ్డి కిందపడి గాయాలపాలయ్యారు.
పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి, నర్సారెడ్డిని ప్రజ్ఞాపూర్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడినుంచి తిరుగు ప్రయాణమైన నర్సారెడ్డి ముఠాను వరదరాజపూర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులు, వాటర్ బాటిళ్లు విసురుకున్నారు. పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీచార్జ్ చేసి కాంగ్రెస్ వాళ్లను అక్కడికి పంపించారు. ఆ తర్వాత వరదరాజపూర్ గ్రామస్తులు పసుపు నీళ్లతో గ్రామాన్ని శుద్ధి చేసుకున్నారు. నర్సన్నపేటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తోపులాట జరిగింది.
రేవంత్ కనుసన్నలో అల్లిన కుట్ర
ఒకేసారి మూకుమ్మడిగా సాగిన ఈ పరిణామాలన్నీ యాదృచ్ఛికం కాదని, రేవంత్‌రెడ్డి కనుసన్నల్లోనే రచించిన పకా కుట్ర అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు సాక్ష్యం అని అంటున్నారు. కెమెరాల ముందే అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడుతూ.. ‘కేసీఆర్ చచ్చిపోవాలని కోరుకుంటున్నాం’ అంటూ ఆయన విషం చిమ్మడం సభ్యసమాజాన్ని విస్మయానికి గురిచేసింది.
బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఓ ప్రజాప్రతినిధి, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చావును కాంక్షించడం కేవలం నోటిదురుసు మాత్రమే కాదని.. ప్రభుత్వ ఆలోచనా విధానానికి, అంతర్గత ఎజెండాకు నిదర్శనమని విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు. ఒకవైపు ఎమ్మెల్యేలతో బహిరంగంగా ప్రాణహాని కలిగించేలా ప్రకటనలు చేయిస్తూ, మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేల నేతృత్వంలో గూండాలను ఎర్రవల్లి వైపు ఉసిగొల్పడం చూసి ప్రజలు భయపడుతున్నారు.
ఇదే నేపథ్యంలో గత రెండు రోజులుగా పోలీసులు ప్రభుత్వానికి కాకుండా అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష నాయకులను నిలువరించడానికి, వారిని గృహనిర్బంధాలు చేయడానికి వేల మంది పోలీసులను రంగంలోకి దింపుతున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగా హింసను ప్రేరేపిస్తుంటే మాత్రం కండ్లప్పగించి చూస్తున్నదని, ఎర్రవల్లి పరిసరాల్లో సామాన్య ప్రజలను, విలేకరులను సైతం అడుగుతీసి అడుగు వేయనీయకుండా అడ్డుకున్న పోలీసులు, కాంగ్రెస్ మూకల వాహనాలకు ఎలా క్లియరెన్స్ ఇచ్చారనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది.
పలాయనం చిత్తగించిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు
వేముల వీరేశం, అనిల్‌రెడ్డి నాయకత్వంలో భువనగిరి నుంచి వచ్చిన మూక కు మరూక్ దామరకుంట ప్రజలు ఎదురొడ్డి నిలబడ్డారు. ఎవరు మీరు? ఎటు పోతున్నారంటూ నిలదీశారు. పోలీసులు రంగప్రవేశం చేసి తాము చూసుకుంటామని ప్రజలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశా రు. 144 సెక్షన్ పెట్టామని సోమవారం నుంచి మీరు చెప్తున్నారని, ఇంత గుంపు ను ఎలా అనుమతిస్తున్నారని దామరకుంట ప్రజలు పోలీసులను నిలదీశారు. రెచ్చిపోయిన రౌడీమూక గ్రామస్తులపై రాళ్లు రువ్వటం మొదలుపెట్టింది.
కర్రలతో దాడి చేసింది. పోలీసులు వారికే వత్తాసు పలుకుతూ గ్రామస్తులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు ధైర్యంగా ఎదురుదాడి మొదలుపెట్టారు. రౌడీమూక దెబ్బల కంటే పోలీసుల లాఠీలే గ్రామస్తుల మీద విరుచుకుపడ్డాయి. ఈలోగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకొని, గ్రామస్తులతో కలిసి ముందుకు రాగా రౌడీమూకలు తోకముడువాల్సి వచ్చింది. తమ ఎదురు దాడిని చూసి ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం పారిపోయారని స్థానికులు చెప్తున్నారు. కాంగ్రెస్ మూకల దాడిలో మాజీ ఎంపీటీసీ కృష్ణయ్య యాదవ్‌తోపాటు మరో ముగ్గురు గ్రామస్తులు తీవ్రంగా గాయపడ్డారు.
రేవంత్ కుతంత్రం కుప్పకూలిందిలా..