TSPSC | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఏకంగా నెట్వర్క్లే బయటికి వస్తున్నాయి. ఈ కేసులో నీటి పారుదలశాఖ డీఈ పూల రమేశ్‌ను సిట్ విచారించగా, పేపర్ లీకేజీతోపాటు మాస్ కాపీయింగ్‌కు పాల్పడినట్టు తేలటంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నది. సోమవారం రెండోరోజు విచారణలో డీఈ రమేశ్ సిట్ అధికారులకు కీలక విషయాలు వెల్లడించినట్టు సమాచారం. రమేశ్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే కోచింగ్ సెంటర్ నిర్వహించేవాడు. గతంలోనూ పోటీపరీక్షల్లో రమేశ్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడినట్టు సిట్ ఆధారాలు సేకరించి నిర్ధారించుకుంటున్నట్టు తెలిసింది. అదే అనుభవంతో ఈ ఏడాది జనవరిలో ఏఈఈ పరీక్షల్లో ఏడుగురితో ఒప్పందం చేసుకొని ఒక్కొక్కరి నుంచి రూ.40 లక్షలు మాట్లాడుకున్నాడు.
టోలిచౌకిలోని ఒక పరీక్ష కేంద్రం నిర్వాహకుడి నుంచి ప్రశ్నపత్రాన్ని వాట్సాప్‌లో తెప్పించుకొని చాట్ జీపీటీ సహకారంతో, పరీక్ష రాస్తున్న వారికి సమాధానాలు చేరవేశాడు. ఇయర్ ఫోన్స్, బనియన్‌కు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన జేబులో రీసివర్స్ను అమర్చి హైటెక్ పద్ధతిలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డట్టు దర్యాప్తులో తేలింది. టీఎస్పీఎస్సీ మాజీ ఉద్యోగి సురేశ్ ద్వారా డీఏవో, ఏఈ పరీక్షల ప్రశ్నపత్రాలు చేతికందడంతో సుమారు 40 మందికి విక్రయించి అడ్వాన్స్ రూపంలో రూ.75 లక్షల వరకు తీసుకున్నట్టు తెలిసింది. ఇలా పరీక్ష రాసినవారిలో కొందరు మాజీ ప్రజాప్రతినిధుల పిల్లలు ఉన్నట్టు సమాచారం. కరీనంగర్‌లోని బొమ్మకల్‌లో మాజీ ప్రజాప్రతినిధి ఇంట్లోనూ సిట్ సోదాలు జరిపింది. ఇద్దరు రాజకీయ నాయకుల కుమారుడు, కుమార్తెలు కూడా రమేశ్‌తో ఒప్పందాలు చేసుకొని పరీక్షలు రాసినట్టు తేలడంతో వాళ్లను కూడా సిట్ విచారిస్తున్నట్టు తెలిసింది.