హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 56శాతం ఉన్న బీసీలను అన్ని రంగాల్లో అణచివేతకు గురిచేస్తున్నారని ఎంసీపీఐ రాష్ట్ర కమిటీ విమర్శించింది. స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే విధించడంపై గురువారం రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర నేతలు గాదగోని రవి, వనం సుధాకర్ మీడియాతో మాట్లాడారు.. సుదీర్ఘ పోరాటాల తర్వాత బీసీలకు స్థానికసంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే విధించడం సబబుకాదని పేర్కొన్నారు. బహుజన సమాజాన్ని అణచివేసేందుకు అగ్రవర్ణ కుట్రలో భాగమే హైకోర్టు తీర్పు అని ఆరోపించారు. 42శాతం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చితేనే రక్షణ ఉంటుందని తెలిసినా..ఈ అగ్రవర్ణ పాలకవర్గ పార్టీలు ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశాయని, ఈ కుట్రల ఫలితంగానే హైకోర్టు స్టే ఇచ్చిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు, హైకోర్టు స్టేకి నిరసనగా శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా బహుజన, శ్రామికవర్గాలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వారు పిలుపునిచ్చారు.
బీసీలను78 ఏండ్లుగా ఆధిపత్య కులాలు అణచివేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్‌పై జీవో ఇచ్చింది రెడ్డి ప్రభుత్వం. అడ్డుకుంటున్నది రెడ్డి జాగృతి కావడమే ఇందుకు నిదర్శనం. కోర్టులో నిలబడదు అని తెలిసినా కాంగ్రెస్ సర్కార్ జీవో-9 తీసుకొచ్చింది. హైకోర్టులో స్టే రావడానికి కారణం కాంగ్రెస్‌తోపాటు బీజేపీ, ఆధిపత్య కులాలే. ఇది బహుజన బీసీ సమాజం ఆత్మగౌరవంపై సాగుతున్న దాడి. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చితేనే బీసీ రిజర్వేషన్లకు రక్షణ ఉంటుంది. ఇప్పటికైనా కుల, బీసీ సంఘాలు కండ్లు తెరవాలి. రాబోయే రోజుల్లో ఆయా పార్టీలకు గుణపాఠం చెప్పాలి.
– జకే వీరస్వామిగౌడ్, సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట అధ్యక్షుడు