హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఆలయాలకు చెందిన భూములను చట్ట ప్రకారం స్వాధీనం చేసుకుని రక్షణ కల్పించలేరా? అని హైకోర్టు దేవాదాయ శాఖ అధికారులను ప్రశ్నించింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం దేవరయంజాల్లోని శ్రీ సీతారామస్వామి ఆలయానికి చెందిన 1521.13 ఎకరాలకు సంబంధించి 1925 నుంచి ఈ నెల 26 వరకు ఉన్న రికార్డులతో గురువారం విచారణకు హాజరుకావాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. దేవరయంజాల్ భూములపై హక్కులకు సంబంధించి దాఖలైన 54 పిటిషన్లపై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ బుధవారం విచారణ చేపట్టారు.
ప్రభుత్వం తరఫు లాయర్లు కాట్రం మురళీధర్‌రెడ్డి, భూక్యా మంగీలాల్‌నాయక్ వాదనలు వినిపిస్తూ.. సదరు భూమిని నిషేధిత జాబితాలో చేర్చుతూ సీసీఎల్ఏ 2014లో జారీ ప్రొసిడింగ్స్ సబబేనని చెప్పారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ వివాదానికి సంబంధించి 2015లో ఉత్తర్వులు జారీ చేశారని, ఇందులో ట్రైబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్న 99 పిటిషన్ల గురించి ప్రస్తుతం కోర్టు దృష్టికి తీసుకు రాలేదని ఇరుపక్షాలను తప్పుబట్టారు. ఆ భూముల ఒరిజినల్ రికార్డులతో దేవాదాయ శాఖ కమిషనర్ గురువారం విచారణకు హాజరుకావాలని లేని పక్షంలో తదుపరి చర్యలు చేపడతామని హెచ్చరించారు.