నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 23 : కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పునివ్వడంతో రెండో రోజైన గురువారం కూడా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నాయి. ఈ సందర్భంగా పటాకులు కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. కేకులు కట్ చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం, జలాభిషేకాలు నిర్వహించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని చౌరస్తా వద్ద కేసీఆర్, హరీశ్‌రావు చిత్రపటాలకు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి క్షీరాభిషేకం చేశారు.
నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని డీ8 కెనాల్ వద్ద కాళేశ్వర జలాలతో కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేశ్ అభిషేకం చేశారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబురాలు నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పటాకులు కాల్చారు.