హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ ఇంజినీరింగ్, ఇతర కాలేజీల్లో సీట్ల పెంపుదల, కోర్సుల విలీనానికి ఏఐసీటీఈ, జేఎన్టీయూ ఆమోదం తెలిపినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ పలు ఇంజినీరింగ్ కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. సీట్ల పెంపు, కోర్సుల విలీనానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని స్పష్టంచేసింది. ఏఐసీటీఈ, జేఎన్టీయూ ఆమోదం మేరకు సీట్ల పెంపు, కోర్సుల విలీనానికి ప్రభుత్వం అనుమతించకుండా వాటి దరఖాస్తులను తిరసరించడాన్ని సవాల్ చేస్తూ ఎంజీఆర్, సీఎంఆర్, కేఎంఆర్, మల్లారెడ్డి, మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, మారుతి తదితర కాలేజీల యాజమాన్యాలు దాదాపు పది పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరించారు.
పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు ఎస్ నిరంజన్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి తదితరులు వాదనలు వినిపిస్తూ.. గత ప్రభుత్వంతో అనుబంధం ఉన్న కారణంగానే తమ కాలేజీల దరఖాస్తులను ప్రస్తుత ప్రభుత్వం తిరసరించిందని ఆరోపించారు. అదనపు సీట్ల వల్ల ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక ప్రభావం ఉండదని వివరించారు. దీనిపై ప్రభుత్వ తరఫు న్యాయవాది సమాధానమిస్తూ.. ప్రైవేట్ విద్యాసంస్థల మధ్య సమానత్వాన్ని, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల అవసరాలు, స్థానిక పరిస్థితులు అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నదని చెప్పారు.
సరైన సామర్థ్యం లేని ఇంజినీర్లు, అవసరానికి మించి విద్యార్థులు బయటికి వస్తున్నారని పేర్కొన్నారు. సిటీ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు సీట్ల భర్తీకి అనుమతిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ కాలేజీలు మూతపడుతున్నాయని పేర్కొన్నారు. గతంలో సీట్ల పెంపునకు అవకాశం ఇచ్చిన కాలేజీలకు తిరిగి అదనంగా తీసుకోవడానికి అనుమతించడంలేదని, ఇందులో వివక్ష ఏమీ లేదని తెలిపారు. తిరసరణకు ఎలాంటి రాజకీయ కారణాలు లేవని కోర్టుకు విన్నవించారు.
ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ కండ్లకోయ, మేడ్చల్ మలాజిగిరి ప్రాంతాల్లోని ప్రైవేట్ కాలేజీల్లో ఖాళీలు, అడ్మిషన్లపై వివరాలను పరిశీలించిన తరువాతే ప్రభుత్వం దరఖాస్తులను తిరసరించిందని పేర్కొన్నారు. సీట్లు పెంపు, కోర్సుల విలీనం ఎందుకు అవసరమన్న దానికి కాలేజీలు ఆధారాలు చూపలేదని తెలిపారు. అంతేకాకుండా, ఏఐసీటీఈ ఒకరోజులోనే కాలేజీల తనిఖీ పూర్తి చేయగా, నిపుణుల కమిటీ సమగ్ర తనిఖీ నిర్వహించి, మౌలిక వసతులు, బోధన, బోధనేతర సిబ్బంది, సాంకేతిక, లైబ్రరీ, కంప్యూటర్లు, ఇతర వివరాలను సమర్పించిందని స్పష్టంచేశారు.
ఆర్టికల్-226 కింద కోర్టుల న్యాయసమీక్ష పరిమితమని, ప్రభుత్వపరంగా విధాన నిర్ణయం తీసుకునే ప్రక్రియ సక్రమంగా జరిగిందో లేదో మాత్రమే కోర్టు పరిశీలిస్తుందని స్పష్టంచేశారు. వాస్తవాంశాలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల విషయంలో కోర్టు అప్పిలేట్ అథారిటీగా వ్యవహరించదని పేర్కొన్నారు. చట్టప్రకారం కాకుండా ఏకపక్షంగా నిర్ణయం ఉన్నప్పుడే కోర్టులు తమ విచక్షణాధికారాన్ని వినియోగించి జోక్యం చేసుకుంటాయని తెలిపారు.
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): వేసవి సెలవుల్లో ప్రైవేట్ కాలేజీలు తరగతులు నిర్వహించడంపై వివరాలు సమర్పించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. వేసవి సెలవుల్లో ప్రైవేట్ కాలేజీలు తరగతులు నిర్వహించకుండా చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ న్యాయవాది బీ క్రాంతికుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ ఇంటర్‌బోర్డు ప్రకటించిన విద్యా క్యాలెండర్‌కు విరుద్ధంగా కాలేజీలు భౌతిక, ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయని వివరించారు. నిరంతర విద్యాబోధనతో నిరాశ, నిసృ్పహలకు గురవుతున్నారని వివరించారు. అదనపు అడ్వొకేట్ జనరల్ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఏ ప్రైవేట్ జూనియర్ కళాశాల కూడా వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించడం లేదని చెప్పారు. దీంతో సెలవుల్లో తరగతుల నిర్వహణపై వివరణ ఇవ్వాలని విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.