హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : ప్రాథమిక హకులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, దాని ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం రెండేండ్ల్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, అక్రమ కేసులు ఈ తీర్పుతో నీరుగారిపోయాయని స్పష్టంచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లి రాజకీయ లబ్ధి పొందాలన్న దురుద్దేశంతోనే ఎన్నికల ముందు, గడిచిన రెండేండ్ల్లుగా కాంగ్రెస్ రకరకాల లీకులు ఇస్తూ, అక్రమ కేసులు బనాయిస్తూ వచ్చిందని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటని, అందులో పదుల సంఖ్యలో ఉండే పిల్లర్లలో రెండు మాత్రమే కుంగితే, రూ.లక్ష కోట్లు కొట్టుకొనిపోయాయనే అబద్ధాన్ని పదేపదే చెప్తూ కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారానికి పాల్పడిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మాని కుంగిన రెండు పిల్లర్లకు వెంటనే మరమ్మతులు చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. కాళేశ్వరమే ఈ రాష్ట్రానికి ప్రాణాధారమని పునరుద్ఘాటించారు. హైదరాబాద్ సహా 70% తెలంగాణకు తాగునీరు, 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అద్భుత ప్రాజెక్టు అని తెలిపారు. రాజకీయాలు చేయడానికి అనేక వేదికలు ఉన్నాయని, రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి రాజకీయాలు చేయకూడదని హితవుపలికారు.
నిజానికి రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్లు ఖర్చు పెడితే కాళేశ్వరం ద్వారా మరో రెండు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నదని హరీశ్‌రావు చెప్పారు. కానీ, గత రెండున్నరేండ్లుగా భూసేకరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. మోటర్లు, రిజర్వాయర్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయని, కేవలం కుట్రతోనే ఆపారని మండిపడ్డారు. పర్ఫార్మెన్స్ మీద రాజకీయాలు జరుగాలని, బీఆర్ఎస్ కంటే మంచి సంక్షేమ పథకాలను అమలు చేయడం, ఆరు గ్యారెంటీలు, 420 హామీల మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని సూచించారు. ఎన్డీఎస్ఏ అనేది కేవలం ఇంజినీరింగ్ టెక్నికల్ రిపోర్ట్ మాత్రమేనని, అందులో ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధం ఉండదని చెప్పారు. మళ్లీ అవే చిల్లర రాజకీయాలు చేస్తే న్యాయస్థానాలు మరోసారి తగిన బుద్ధి చెప్తాయని హెచ్చరించారు.
అసెంబ్లీ సాక్షిగా రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, సామ్లను బయటపెడుతున్నామని హరీశ్‌రావు తెలిపారు. సమాధానం చెప్పుకోలేక తమను సస్పెండ్ చేయడమే కాకుండా, అవినీతిని బయటపెట్టిన 48 గంటల్లోనే తన మీద రెండు ఎంక్వైరీలు వేశారని చెప్పారు. తప్పులు సరిదిద్దుకోవడం మానేసి ప్రతిపక్షాలను వేధించడం, అక్రమ కేసులతో లొంగదీసుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. తాము కేసీఆర్ నాయకత్వంలో రాటుదేలిన ఉద్యమకారులమని, రాష్ట్ర ప్రయోజనాల కోసం రేవంత్‌రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా పోరాటం ఆపబోమని హెచ్చరించారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నదని, వారి గోడు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. వడ్లలో 5 కిలోల తరుగు తీస్తున్నారని, మకజొన్న, శనగలు, పొద్దుతిరుగుడు కొనే దికు లేదని విమర్శించారు. రుణమాఫీ పూర్తి కాలేదని, రైతుభరోసా పడలేదని, కరెంట్ సక్రమంగా అందక రైతులు రోడ్లెకినా ఏ ఒక మంత్రీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెట్ రాక విద్యార్థులు, యాజమాన్యాలు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడిందని, రేవంత్‌రెడ్డి ముందు వీటి మీద దృష్టి పెట్టాలని చురకలటించారు. రాజకీయ కాలయాపన చేస్తే ప్రజాక్షేత్రంలో పీఠం కదిలిపోవడం ఖాయమని, భయకంపితులై మాట్లాడుతున్న రేవంత్ మాటలే దీనికి నిదర్శనమని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటలకు ఎలాంటి విలువ లేదని, ముందుగా ‘గోదావరి-బనకచర్ల లింక్’ ద్వారా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని సూచించారు. ఆంధ్రాకు ప్యాకేజీలు, ప్రాజెక్టులు వస్తుంటే, తెలంగాణకు ఏమొస్తున్నదో సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని హరీశ్‌రావు ప్రకటించారు. కేసీఆర్ ప్రభుత్వమే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపి, జీవో ఇచ్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనే కార్మికులు అడుగుతున్నారని, కొత్తవి ఏమీ అడగడం లేదని తెలిపారు. మహాలక్ష్మీ పథకం పెట్టి ఆర్టీసీకి ఇవ్వాల్సిన రూ.3 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదని విమర్శించారు. నిధులు లేకపోవడంతో కార్మికులకు డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నారని, బడ్జెట్లో చూపిస్తున్నా నిధులు విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీకి ఏటా రూ.1,500 కోట్ల గ్రాంట్ ఇచ్చామని గుర్తుచేశారు. తక్షణమే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిషరించాలని డిమాండ్ చేశారు.
పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు చట్టబద్ధత లేదని హైకోర్టు తీర్పుతో తేటతెల్లమైం ది. హైకోర్టు ఇచ్చిన తీ ర్పును స్వాగతిస్తు న్నాం. కాళేశ్వరంపై ని రాధార ప్రచారం చేసి, కేసీఆర్ గౌరవ ప్రతిష్టల ను దెబ్బతీయాలనే కుయుక్తితో కాంగ్రెస్ నాయకులు వ్యవహరించారు. చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తుందని తీర్పుతో వెల్లడైంది.
ఘోష్ కమిషన్ పేరుతో కేసీఆర్, హరీశ్‌రావులను వేధించ డం కక్ష పూరితమైన చర్య. కొన్ని రోజులు కాళేశ్వరం, మరికొన్ని రోజులు ఫార్ములా ఈ-రేసు, ఇంకొన్ని రోజులు ఫోన్‌ట్యాపింగ్ అంటూ కాంగ్రెస్ డైవర్షన్ రాజకీయాలకు అలవాటు పడింది. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకూ పోరాడుతూనే ఉంటాం.
హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు, రేవంత్ రెడ్డి సర్కార్‌కు చెంప పెట్టు లాంటిది. రేవం త్ సర్కార్‌కు సాధార ణ ప్రజల భాషలో చెప్పాలంటే చెప్పు దెబ్బలాంటిది. ఉద్యమనేత కేసీఆర్‌ను బద్నాం చేయాలన్న కాంగ్రెస్ సర్కార్ కుట్ర భగ్నమైం ది. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే జీవనాధారమని స్పష్టమైంది.