హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : ఒక రిటైర్డ్ ఉద్యోగిపై తప్పుడు కేసు నమోదైన వ్యవహారంలో హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి రూ.50 వేలు జరిమానా విధించింది. ఉద్యోగిపై నమోదైన కేసును కొట్టివేస్తూ జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ఇటీవల తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. హిందుస్తాన్ యాంటిబయోటిక్స్ లిమిటెడ్ జోనల్ మేనేజర్‌గా పనిచేసిన ఏకే గుప్తా 2009 జనవరి 9న ఉద్యోగ విరమణ చేశారు. కాగా ఓ ఫిర్యాదు మేరకు సీబీఐ 2010 మేలో సికింద్రాబాద్ లాలాగూడలోని రైల్వే దవాఖాన నుంచి రాక్సిత్రోమైసిన్ మాత్రల శాంపిల్స్ సేకరించింది. పరీక్షల్లో అవి ప్రమాణాల మేరకు లేవని తేలింది. దీంతో కేంద్ర ఔషధ నియంత్రణ మండలి కేసు నమోదు చేసి, గుప్తాను ప్రధాన నిందితునిగా చేర్చింది. అయితే మందుల శాంపిల్స్ సేకరణ సమయానికి తాను రిటైర్ అయ్యానని, నాంపల్లి కోర్టులోని క్రిమినల్ కేసును కొట్టేయాలని కోరుతూ గుప్తా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. మందుల శాంపిల్స్ సేకరణ సమయానికి హిందుస్థాన్ యాంటిబయోటిక్స్ సంస్థ ఇన్చార్జి డివిజన్ మేనేజర్‌గా రాజేంద్ర ఉన్నట్టు గుర్తించారు.
ప్రీత్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆ మందును హిందుస్థాన్ యాంటిబయోటిక్స్ లిమిటెడ్ తరఫున ఉత్పత్తి చేసి సరఫరా చేసినట్టు కూడా తేల్చారు. మందు తయారీలో పిటిషనర్ పాత్ర లేదని గుర్తించారు. పిటిషనర్ రిటైర్ అయ్యాక తయారైన నాణ్యతలేని ఔషధాలకు అతడిని బాధ్యుడిని చేస్తూ కేసు నమోదుచేయడం చెల్లదని తీర్పు వెలువరించారు. ఎవరైనా వ్యక్తి లేదా ఉద్యోగిపై కేసు నమోదు చేయాలనే నిర్ణయానికి అధికారులు లేదా దర్యాప్తు సంస్థలు వచ్చే ముందు స్వతంత్రంగా విచక్షణను వినియోగించాలని హితవు చెప్పారు. కేసు నమోదుకు ముందు కసరత్తు చేయకపోతే ఆ వ్యక్తి చేసే ఉద్యోగం నష్టపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. పిటిషనర్ పై కేసును కొట్టివేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం గుప్తాకు రూ.50 వేలు పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించారు.