హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తేతెలంగాణ): హైదరాబాద్ బంజారాహిల్స్‌లో సుల్తాన్ ఉల్ ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంజినీరింగ్, ఇతర కాలేజీల అనుమతులను రద్దు చేయడాన్ని హైకోర్టు సమర్ధించింది. ఆయా కాలేజీల అనుమతులను రద్దు చేస్తూ 2017లో ఏఐసీటీఈ జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ఆసారం లేదని తేల్చిచెప్పింది. నిబంధనల ప్రకారం ఏర్పాటుకాని కాలేజీల అనుమతులను రద్దుచేసే అధికారం ఏఐసీటీఈకి ఉన్నదని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి తీర్పు వెలువరించారు.
ఆయా విద్యాసంస్థలున్న భూముల యాజమాన్య స్వాధీన పత్రాలను సుల్తాన్ ఉల్ ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ సమర్పించలేదని, భూమి హకులు లేకుండా అనుమతులు కోరడానికి వీల్లేదని తెలిపారు. ఈ వ్యవహారంపై నిపుణుల కమిటీ నివేదికకు అనుగుణంగానే అనుమతులు రద్దయ్యాయంటూ.. ఆ సొసైటీ పిటిషన్లను కొట్టివేశారు. దీని వల్ల ఆ కళాశాలల విద్యార్థులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని, ఇప్పటివరకు ఆ కాలేజీల్లో చదివిన, చదువుతున్న విద్యార్థుల సర్టిఫికెట్లు యథాతథంగా అందుతాయని స్పష్టం చేశారు.
ఆధారాల్లేకుండా రిట్ పిటిషన్లు దాఖలు చేసినందుకు ఆ సొసైటీ ఆధ్వర్యంలోని 3 కళాశాలలతోపాటు మరికొందరు వ్యక్తులకు రూ.50 వేల చొప్పున జరిమానా విధిస్తున్నట్టు ప్రకటింస్తూ.. ఆ మొత్తాన్ని మహేంద్రహిల్స్‌లోని శ్రీవిద్యాస్ సెంటర్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్ సంస్థకు ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై అప్పీల్ దాఖలుకు వీలుగా తీర్పు అమలును 2 వారాలపాటు నిలిపివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.