Bhoodan Lands | హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : భూదాన్ భూములను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతరులు కొనుగోలు చేశారనే కేసులో సింగిల్ జడ్జి జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. ఐపీఎస్ అధికారులతోపాటు ఓ వ్యాపారవేత్త దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. ఈ వ్యవహారాన్ని సింగిల్ జడ్జి వద్దనే తేల్చకోవాలని, వెకేట్ పిటిషన్ అక్కడే దాఖలు చేసుకోవాలని సూచించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నంబర్లలోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని సింగిల్ జడ్జి ఏప్రిల్ 24న మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు. ఆ భూములను విక్రయించడం, బదిలీ చేయడం సహా ఎలాంటి మార్పులు చేయవద్దని 2వ పేజీలో
ఆదేశించారు. ఈ ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ పలువురు ఐపీఎస్ అధికారులు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ ముగిసినట్టు డివిజన్ బెంచ్ ప్రకటించింది.
తొలుత ఐపీఎస్ అధికారుల తరఫున సీనియర్ న్యాయవాదులు దేశాయ్ ప్రకాష్‌రెడ్డి, ఎస్ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ల వాదనలు వినకుండా, కనీసం నోటీసు కూడా జారీ చేయకుండా సింగిల్‌జడ్జి ఉత్తర్వులు జారీచేయడం చెల్లదని అన్నారు. బీర్ల మహేశ్ (ప్రతివాది) ప్రభుత్వానికి సమర్పించిన వినతిపత్రంపై ఏం చర్యలు తీసుకున్నదీ నివేదిక కోరారని, అయితే, ఆయన కోరని అంశాల్లోకి సింగిల్ జడ్జి వెళ్లి అప్పీల్ పిటిషనర్ల భూములను నిషేధిత జాబితాలో ఉంచాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీచేయడం చట్ట వ్యతిరేకమని అన్నారు. ఊహాజనితమైన ఆరోపణలతో దాఖలు చేసిన పిటిషన్‌పై వెలువడిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు.
పిటిషనర్ల వాదనపై స్పందించిన ధర్మాసనం.. సింగిల్ జడ్జి వెలువరించింది మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే కదా అని పేర్కొంది. మధ్యంతర ఉత్తర్వులు ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపవు కదా? భూ యాజమాన్య హకులకు నష్టమేమీ జరుగలేదు కదా? కాబట్టి సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో ఎలా జోక్యం చేసుకోవా లో చెప్పండి? అని ప్రశ్నించింది. దీనిపై న్యాయవాదులు స్పందిస్తూ, సింగిల్ జడ్జి ఆర్డర్ వల్ల ఈడీ, సీబీఐ, సీవీసీ రంగంలోకి దిగే అవకాశం ఉందని, రేపే తమ స్థలాలను పరిశీలిస్తే పిటిషనర్ల పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ధర్మాసనం కల్పించుకుని అప్పీల్‌దారుల హకులపై ప్రభావం చూపే విధంగా సింగిల్‌జడ్జి తుది ఉత్తర్వులు ఇవ్వలేదని గుర్తుచేసింది. మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.