హైదరబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఖానాపూర్‌లో తమ ఇండ్ల కూల్చివేతకు అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ విద్యాధర్‌రెడ్డి, అనుపమ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఉస్మాన్‌సాగర్ చెరువుకు సంబంధించిన మ్యాప్ వివరాలను అందజేయాలని, తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు నిర్మాణాలను కూల్చివేయరాదని ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
గత తనిఖీల తర్వాత ఎఫ్టీఎల్ పరిధిలో ఇండ్ల స్థలాలు లేవని అధికారికంగా పత్రాలు ఇచ్చిన అధికారులు ఇప్పుడు పిటిషనర్లకు నోటీసులు ఇవ్వడంపై జస్టిస్ వినోద్‌కుమార్ సందేహాన్ని వ్యక్తం చేస్తూ.. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేశారు. ఉస్మాన్‌సాగర్ మ్యాప్ సమర్పించడంతోపాటు కూల్చివేతలపై కౌంటర్ దాఖ లు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేటలోని దుర్గంచెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం చేపట్టే చర్యలు చట్టంలోని నిబంధనలకు లోబడి ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. అక్కడ 15 ఎకరాల్లోని లేఔట్లలో ప్లాట్లను కొనుగోలు చేసినవారికి వాల్టా చట్టంలోని సెక్షన్ 23 కింద డిప్యూటీ కలెక్టర్ నోటీసులు ఇవ్వాడాన్ని సవాలు చేస్తూ దాఖలైన 4 పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
ఆ నోటీసులను షోకాజ్ నోటీసులుగా పరిగణించాలని అధికారులను ఆదేశించింది. ఆ ప్లాట్లలోని నిర్మాణాల కూల్చివేతకు ముందు బాధితులకు నోటీసులు జారీ చేయాలని, వారు సమర్పించే ఆధారాలను పరిశీలించి, వివరణ తీసుకున్నాకే అధికారులు ముందడుగు వేయాలని ఉత్తర్వులు జారీచేసింది.