నమస్తే నెట్వర్క్ : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. రిజర్వేషన్ల అమలు పై హైకోర్డు స్టే నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నిరసనలు కొనసాగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ సమస్య తలెత్తిందని బీసీ సంఘాల నేతలు ఫైర్ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం సుంకిడి అంతర్రాష్ట్ర రహదారిపై బీసీలు రాస్తారోకో చేశారు. మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ వ్యతిరేక శక్తుల దిష్టిబొమ్మను దహనం చేశారు. మంచిర్యాలలోని ఓవర్‌బ్రిడ్జి వద్ద బీసీ సమాజ్, బీసీ జేఏసీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. భీమారం మండలకేంద్రంలో బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూపునార్ రమేశ్, నాయకులతో కలిసి రెడ్డి జాగృతి దిష్టిబొమ్మను దహనం చేశారు. కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌లో రెడ్డి జాగృతి దిష్టి బొమ్మను దహనం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చర్యలను ఖండిస్తూ చౌక్‌లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని అంబేదర్ విగ్రహానికి జిల్లా కమిటీ బాధ్యులు, సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి వినతి పత్రం అందజేశారు. చిగురుమామిడిలో బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి బీసీ నాయకులు వినతిపత్రం అందజేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పాతబస్టాండ్ శాస్త్రీ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకొని నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కొడిమ్యాల మండల కేంద్రంలో బీసీ సంఘాల నాయకులు పట్టణ బంద్ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ క్రాస్‌రోడ్ వద్ద పెద్దపల్లి – మంథని ప్రధాన రహదారిపై కమాన్‌పూర్ క్రాస్‌రోడ్ వద్ద ధర్నా, రాస్తారోకో చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం- చర్ల ప్రధాన రహదారిపై కేశంపట్నం వద్ద బీసీ ఐక్య కార్యాచరణ దుమ్ముగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మణుగూరు అంబేద్కర్ సెంటర్లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందించారు. భద్రాచలంలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ఆళ్లపల్లి మండలంలోని ఆళ్లపల్లి, మర్కోడు, అనంతోగు గ్రామాల్లో బీసీ సంఘం నాయకులు వ్యాపార సముదాయాలు బంద్ చేశారు.