హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ‘రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా చట్టాలను తుంగలో తొక్కారు. కోర్టులంటే లెకలేనట్టుగా చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారు. కోర్టులో కేసు ఉండగా పిటిషనర్‌పై తప్పుగా కేసు నమోదు చేయించారు. చట్ట నిబంధనల పరిధిని అతిక్రమించారు. నిజంగానే కోర్టులో తప్పుడు సమాచారంతో పిటిషనర్ వ్యాజ్యం వేసుంటే, ఆ విషయాలను కోర్టుకు చెప్పాలి. కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయించేందుకు ప్రయత్నించాలి. ధికరణ పిటిషన్ హైకోర్టులో విచారణ ఉండగా ఐఏఎస్ వంటి ఉన్నతస్థాయి అధికారి ఇలా చేయడం కోర్టులను బేఖాతరు చేయడమే.
కోర్టులను అప్రతిష్టపాలు చేసేలా పోలీసులతో కేసు నమోదు చేయించడం కలెక్టర్ తీరుకు పరాకాష్ఠ. ఇది పిటిషనర్ స్వేచ్ఛాయుత జీవనాన్ని, ప్రాథమిక హకులను హరించడమే. ఇది రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హకులను కాలరాసే ప్రయత్నమే. ఇవన్నీ కావాలని ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యలే. కలెక్టర్ తీరు, చర్యలు ఎంతమాత్రం క్షమార్హం కాదు. ఇలాంటి అధికారి జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. ఇలాంటి చర్యల వల్ల పాలనపై ప్రతికూల ప్రభావం పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కోర్టులను కలెక్టరే అదీ ఐఏఎస్ చదివిన అధికారే ఖాతరు చేయకపోలే ఎలా? కోర్టు ఆదేశాల్ని కలెక్టర్ అగౌవరపర్చారని నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఈ చర్యలు కలెక్టరేట్‌కే అప్రతిష్ట.
కలెక్టర్‌ను స్వయంగా కోర్టుకు పిలిచి విచారించాం. కలెక్టర్ తీరు విస్మయానికి, దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ తప్పుడు చర్యలను అదుపు చేయాల్సిందే. కోర్టులు వదిలేస్తే పాలనలో అశాంతి మాత్రమే మిగులుతుంది. పాలనలో అశాంతితోపాటు ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. కలెక్టర్‌కు బాగా సర్వీసు ఉన్నందున ఇంకా సర్వీసులో కొనసాగాలన్న ఒకే ఒక కోణంలో చర్యలు తీసుకోవాలనే ఉత్తర్వులు జారీ చేయడం లేదు. కలెక్టర్‌ను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి పిలిచి మందలించాలి అని హైకోర్టు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై నిప్పులు చెరిగింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ఈనెల 23న తీర్పు వెలువరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన వనపట్ల కవితకు చెందిన ఇంటిని ప్రభుత్వం 2004లో సేకరించింది. పరిహారం చెల్లించే నిర్వాసితుల జాబితాలో తన పేరు లేదంటూ కవిత హైకోర్టును ఆశ్రయించారు. నిర్వాసితుల జాబితాలో కవిత పేరు చేర్చి చట్ట ప్రకారం ఆమెకు పరిహారం చెల్లించాలని హైకోర్టు గతంలో ఆదేశించింది.
అయితే ఈ ఉత్తర్వులు అమలు కాలేదంటూ కవిత కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో పరిహారం చెల్లించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం అప్పీల్ దాఖలు సింది. ఈ రెండు వ్యాజ్యాలు హైకోర్టు విచారణలో ఉన్నాయి. ఇదే సమయంలో కోర్టును తప్పుదోవ పట్టించి ఉత్తర్యులు పొందారంటూ కవితపై సివిల్/క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాలని కలెక్టర్.. ఆర్డీవో, వేములవాడ తహసీల్దార్లకు లేఖలు రాశారు.
కలెక్టర్ లేఖ ఆధారంగా తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో వేములవాడ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల కేసును కొట్టేయాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పూర్తిచేసిన జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి పైవిధంగా తీర్పు చెప్పారు. కోర్టుకు తప్పుడు సమాచారంతో ఉత్తర్వులు పొంది ఉంటే ఆమెపై కలెక్టర్ హైకోర్టుకు చెప్పకుండా పోలీసు కేసు నమోదు చేయించడం చెల్లదని పేర్కొంది. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్‌కు లేదని తేల్చిచెప్పింది.