హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం జీవో 123 కింద పరస్పర అంగీకారంతో భూములు ఇచ్చినవారికి పునరావాస, పునర్నిర్మాణ (ఆర్అండ్ఆర్) ప్యాకేజీ ప్రయోజనాలను నిరాకరించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. భూమికి చెల్లించిన పరిహారం, పునరావాస, పునర్నిర్మాణ ప్రయోజనాలు వేర్వేరు అంశాలని హైకోర్టు జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి చెందిన తిగుళ్ల బాలమణి, ఆసర్ల పోచవ్వ, లింగోల్ల బాలనర్సవ్వ, ఎకల బాలవ్వ హైకోర్టును ఆశ్రయించారు.
మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం ప్రభుత్వం తమ భూములను తీసుకున్నదని, పరిహారం చెల్లించినప్పటికీ పునరావాస, పునర్నిర్మాణ ప్రయోజనాలను కల్పించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పునరావాస ప్రయోజనాలను విడిగా కల్పించేలా జీవో 214 జారీ అయిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది రవికుమార్ తెలిపారు. జీవో 123 కింద భూములను తీసుకోరాదని గతంలో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సవాలు చేసిందని, ఆ వ్యవహారం ఇంకా పెండింగ్‌లో ఉన్నదని, ఈ పరిణామాల మధ్య ప్రభుత్వం ఓ ఒప్పందం ద్వారా పిటిషనర్ల నుంచి భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నదని వివరించారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ వాదిస్తూ.. భూముల లావాదేవీలు పరస్పర అంగీకారంతో పూర్తయ్యాయని తెలిపారు. జీవో 123 చట్టబద్ధతపై దాఖలైన అప్పీలు కూడా పెండింగ్‌లో ఉన్నందున ఆ వ్యవహారం తేలకముందే అదనపు ప్రయోజనాలు ఇవ్వలేమని స్పష్టం చేశారు.
పునరావాస హక్కును తిరస్కరించలేరు..
ఈ వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. భూయజమానులు అంగీకార పత్రాలపై సంతకాలు చేశారన్న అంశం పునరావాస, పునర్నిర్మాణ ప్రయోజనాలను నిరాకరించడానికి కారణం కాదని పేరొన్నది. 2017లో చేసిన చట్టసవరణకు 2014 జూన్ 2 నుంచి పూర్వప్రభావం కల్పించిన అంశాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకున్నది. భవిష్యత్తులో చట్టం ద్వారా కల్పించే హకును పిటిషనర్లు అంగీకార పత్రాలు ఇచ్చిన సమయంలో ముందుగానే వదులుకున్నట్టు భావించలేమని స్పష్టం చేసింది. పునరావాస హకులను సాధారణ ఒప్పందం లేదా హామీపత్రం ద్వారా పూర్తిగా తొలగించలేమని తెలిపింది.
అదనపు పరిహారంగా చూడరాదు..
భూములు కోల్పోయిన కుటుంబాల పునరావాసానికి చట్టబద్ధమైన ప్రయోజనాలు కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రతి పిటిషనర్ అర్హతనూ అధికారులు విడివిడిగా పరిశీలించాలని, ప్రతి ఒకరికీ తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వాలని, కుటుంబ పరిస్థితులు, భూ సేకరణ వివరాలు, ఇప్పటికే పొందిన ప్రయోజనాలు తదితర అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
తిరస్కరిస్తే కారణాలు వెల్లడించాలి
పునరావాస ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒకరి విషయంలో కారణాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేయాలని పేరొన్నది. ఒకే ప్రయోజనాన్ని రెండుసార్లు పొందకుండా చూడాలని స్పష్టం చేసింది. ఉత్తర్వుల ప్రతిని అందుకున్న తేదీ నుంచి 6 నెలల్లోగా ఈ మొత్తం ప్రక్రియను పూర్తిచేసి అర్హులైన వారికి పునరావాస, పునర్నిర్మాణ ప్రయోజనాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. అధికారులు తీసుకునే నిర్ణయంతో పిటిషనర్లు అసంతృప్తికి గురైతే చట్టప్రకారం అందుబాటులో ఉన్న పరిషార మార్గాలను ఆశ్రయించవచ్చని పేరొన్నది. భూమికి పరిహారం తీసుకున్నప్పటికీ చట్టబద్ధంగా అర్హత ఉంటే పునరావాస, పునర్నిర్మాణ ప్రయోజనాలను కల్పించాల్సిందేనని హైకోర్టు తీర్పు వెలువరించింది.