హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): ఎంబీఏ ప్రవేశాల కోసం క్యాట్ పరీక్షలో వచ్చిన మొత్తం పర్సంటైల్‌ను మాత్రమే ఆధారంగా తీసుకుని అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలవాలని ఆదేశించబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ అడ్మిషన్లకు సంబంధించి అంశాలవారీగా నిర్దేశించిన కనీస అర్హతా ప్రమాణాలను అభ్యర్థులు తప్పనిసరిగా కలిగి ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. వివరాలు.. ఎంబీఏ అడ్మిషన్లలో ఐఐఎం ముంబై తనను ఇంటర్వ్యూకు ఎంపిక చేయలేదని సవాలు చేస్తూ మేడ్చల్ మలాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కే సత్యసాయి హైకోర్టును ఆశ్రయించారు.
క్యాట్ పరీక్షలో మొత్తం 99.52 పర్సంటైల్ సాధించినప్పటికీ, రెండో దశ ఎంపికలో తన పేరు లేదని, ఇతర అభ్యర్థుల కంటే తనకు ఎకువ సోర్ ఉన్నప్పటికీ అడ్మిషన్ నిరాకరించారని వివరించారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం.. అడ్మిషన్లలో మొత్తం పర్సంటైల్‌తోపాటు విభాగాలవారీగా నిర్దేశించిన కటాఫ్ మారులు కూడా కీలకమని స్పష్టం చేశారు. అభ్యర్థుల సంఖ్యను బట్టి కటాఫ్ మార్కులు మారవచ్చని, వాటిని నిర్ణయించే అధికారం విద్యాసంస్థలకే ఉంటుందని తెలిపారు.
క్యాట్ పరీక్షలో పిటిషనర్ మొత్తం 99.52 పర్సంటైల్ సాధించినప్పటికీ డాటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ విభాగంలో 92.87 పర్సంటైల్ మాత్రమే పొందారని గుర్తుచేశారు. కానీ, ఈ విభాగంలో 93.50 పర్సంటైల్‌ను కటాఫ్‌గా నిర్ణయించినట్టు వెల్లడైందని, ఈ కనీస ప్రమాణాన్ని అందులేకపోవడంతోనే పిటిషనర్‌కు అడ్మిషన్ నిరాకరించారని పేర్కొంటూ.. కనీస అర్హత ప్రమాణాలను చేరుకోకుండా ఇంటర్వ్యూకు పిలవాలని కోరే హకు పిటిషనర్‌కు లేదని తీర్పు చెప్పారు.