హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): రుణంపై కొనుగోలు చేసిన వాహనం.. ఏదైనా కేసులో పోలీసులకు పట్టుబడితే, రుణం ఇచ్చిన సంస్థకు ఆ వాహనాన్ని అప్పగించాలని పోలీసులకు ఉత్తర్వులు ఇవ్వబోమని హైకోర్టు స్పష్టంచేసింది. రుణం ఇచ్చినంతమాత్రన రుణదాతకు వాహనంపై హకులు ఉండవని, కేవలం తాకట్టు హకులే ఉంటాయని చెప్పింది.
నల్లబెల్లం తరలిస్తుండగా సీజ్ చేసిన బొలెరో వాహనాన్ని అప్పగించేలా ఎక్సైజ్ శాఖకు ఉత్తర్వులివ్వాలని కోరుతూ టైగర్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ టీ వినోద్‌కుమార్ విచారణ జరిపారు. వాహనాన్ని తాకట్టు పెట్టుకుని రుణం మంజూరు చేశామని, ఎక్సైజ్ పోలీసులు ఆ వాహనాన్ని సీజ్ చేయడం వల్ల అప్పు ఇచ్చిన సంస్థ నష్టపోయిందని పిటిషనర్ న్యాయవాది వాదించారు.
మంజూరు చేసిన రుణం చెల్లించనప్పుడు ఆ వాహనాన్ని వేలం వేయగా వచ్చిన డబ్బును రికవరీ చేసుకోవాలనే రుణ ఒప్పందం ఇరుపక్షాల మధ్య ఉంటుందని హైకోర్టు గుర్తుచేసింది. నల్లబెల్లం అక్రమ రవాణా చేస్తుండగా పట్టుబడిన వాహనాన్ని విడుదల చేయాలని ఉత్తర్వులు ఇవ్వబోమని చెప్పింది.