హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో తాము కొనుగోలు చేసిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు ఐఏఎస్/ఐపీఎస్ అధికారులు చేసిన ప్రయత్నాలు హైకోర్టులో ఫలించలేదు. సర్వే నంబర్లు 181, 194, 195లోని భూదాన్ భూములపై ఉన్న స్టేను ఎత్తివేయాలంటూ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్, వికాస్‌రాజ్ కుమార్తె ఐశ్వర్యరాజ్, ఐపీఎస్ విశ్వప్రసాద్ కుమారుడు వరుణ్ తదితరులతోపాటు ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్స్ వేసిన మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. భూదాన్ భూముల్లో లావాదేవీలను నిర్వహించరాదంటూ ఏప్రిల్ 24న ఇచ్చిన స్టే ఎత్తివేయాలని వేసిన మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ భూములపై దర్యాప్తునకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని ఒకటి, పట్టాదార్ పాస్‌పుస్తకాలు, మ్యుటేషన్ ఉత్తర్వుల కాపీలను ఇప్పించాలనే రెండో పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం ఉత్తర్వులను జారీచేశారు.
నాటి కలెక్టర్‌పై తీవ్ర ఆరోపణలు
నాగారంలోని సర్వే నంబర్లు 181, 182, 194, 195లోని భూదాన్, గైరాన్ భూములకు సంబంధించిన లావాదేవీలపై సీబీఐ, ఈడీలతో దర్యాప్తు జరిపించాలంటూ బీర్ల మల్లేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ భూములపై లావాదేవీలు నిర్వహించరాదని, నిషేధిత జాబితాలో చేర్చాలని గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వుల ఎత్తివేతకు కేంద్ర సర్వీస్ అధికారుల ప్రయత్నాలు బెడిసికొట్టాయి. భూదాన్ భూముల లావాదేవీలపై విచారణ కమిషన్‌ను నియమించాలని కోరుతూ గ్రామానికి చెందిన వడ్య రాములు, పాస్‌బుక్‌లు, మ్యుటేషన్ ప్రొసీడింగ్స్ కాపీలను అందించాలంటూ బీర్ల మల్లేశ్ మరో పిటిషన్ వేశారు. వీటన్నింటిపైనా జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ జరిపి ఉత్తర్వులు జారీచేశారు. పాస్‌బుక్‌లు, ఇతర పత్రాలు ఇవ్వాలన్న మల్లేశ్ పిటిషన్‌ను కొట్టివేస్తూ.. సర్టిఫైడ్ కాపీల నిమిత్తం సీసీఎల్ఏతోపాటు ఇతర అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
తండ్రి గిఫ్ట్‌డీడ్ ద్వారా వచ్చిన 10.17 ఎకరాలపై హకులున్నందున విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలన్న వడ్య రాములు పిటిషన్‌ను కొట్టివేశారు. విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి చట్టం అనుమతించదని న్యాయమూర్తి తెలిపారు. ఈ భూములను తాము కొన్నామంటూ 28 మంది ప్రైవేటు వ్యక్తులు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లను అనుమతించారు. నాగారం భూములకు సంబంధించి ప్రైవేటు వ్యక్తులతోపాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు ఉన్నట్టు ప్రాథమిక ఆధారాలు కనిపిస్తున్నాయని న్యాయమూర్తి పేరొన్నారు. గతంలో రంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేసిన అమోయ్‌కుమార్ పదవీకాలంలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో కూడిన పిటిషన్లపై విచారణ చేయాల్సి ఉన్నదని చెప్పారు. ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై కొందరు అప్పీలు చేసినప్పటికీ డివిజన్ బెంచ్ ఇందులో జోక్యం చేసుకోలేదని గుర్తుచేశారు. కేంద్ర సర్వీస్ అధికారులు వేసిన మధ్యంతర పిటిషన్లను కూడా కొట్టివేస్తున్నట్టు ప్రకటించారు.