హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా, పటాన్చెరు మండలం, పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి 54 మంది మరణించిన ఘటనపై జరుగుతున్న దర్యాప్తు తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. అమాయకుల ప్రాణాలు పోయిన ఘటనపై దర్యాప్తు తీరు కలవరపెడుతున్నదని వ్యాఖ్యానించింది. ఈ ఏడాది జూన్ 30న జరిగిన భారీ ప్రమాదంలో 54 మంది మృతి చెందగా, 8 మంది అదృశ్యం, 28 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
ఈ ఘటనపై దర్యాప్తు, బాధితులకు పరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతున్నదని, కేసును సిట్‌కు అప్పగించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన కే బాబూరావు దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ కేసులో 237 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన తర్వాత కూడా పోలీసులు ఒక నిర్ణయానికి రాలేకపోయారా అని ప్రశ్నించింది.
ఇంత పెద్ద ఘటనపై స్థానిక పోలీసులతో మాత్రమే దర్యాప్తు చేయించడాన్ని ఆక్షేపించింది. ఆ ఘటనపై విచారణకు నిపుణులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఎందుకు వేయలేదని నిలదీసింది. కేసు దర్యాప్తు తీరుపై సందేహాలున్న నేపథ్యంలో స్వయంగా హైకోర్టునే పర్యవేక్షణ చేయమంటారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పేలుడు ఘటనపై దర్యాప్తునకు సంబంధించిన వివరాలను కూడా సమర్పించలేదని మండిపడింది. దర్యాప్తు అధికారి కేసు డైరీతోపాటు తగిన రికార్డులతో వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. కౌంటరు దాఖలుకు రెండు వారాల గడువు కావాలని సిగాచి కంపెనీ చేసిన వినతిని ఆమోదించింది. తదుపరి విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేసింది.
తొలుత పిటిషనర్ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ వాదనలు వినిపిస్తూ.. ప్ర భుత్వం ఏర్పాటుచేసిన నిపుణుల ప్రత్యేక కమిటీ ఇచ్చిన 278 పేజీల నివేదిక తప్పులతడకగా, లోపభూయిష్టంగా ఉన్నదని తెలిపా రు. ఆ కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచిందని, చివరిసారి 1994లో కంపెనీలో భద్రత, మౌ లిక సదుపాయాలపై తనిఖీ జరిగిందని చె ప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. కంపెనీలో ప్రమాదకరమైన 17 టన్నుల పేలుడు, రసాయనాలు నిల్వ ఉన్నాయని, వాటివల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని ఎత్తిచూపింది. దర్యాప్తు పురోగతిపై నిలదీసింది.
ప్రమాదానికి దారితీసిన పరిస్థితుల గురించి మాత్రమే కమిటీ రిపోర్టులో ఉందని, నేర దర్యాప్తుపై ఏమీ లేదని ఎత్తిచూపింది. రాష్ట్ర ప్రభుత్వ, పోలీసుల తీరు ఇలాగే కొనసాగితే కేసు దర్యాప్తును తామే పర్యవేక్షించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ ప్రమాద ఘటనలో 10 నుంచి 14 చట్టాల ఉల్లంఘనలు జరిగి ఉంటాయని, వాటిపై ఆయా శాఖల వాంగ్మూలాలు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. దీనిపై అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్‌రెడ్డి స్పందిస్తూ.. 237 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశామని, మరో 15 మంది సాక్షులను విచారణ చేయాల్సివుందని చెప్పారు.
నిపుణుల కమిటీ నివేదిక రెండు రోజుల క్రితమే పోలీసులకు అందిందని, దీని ఆధారంగా చర్యలు ఉంటాయని తెలిపారు. బాధితులకు పరిహారం చెల్లింపులు జరిగాయన్నారు. గత సెప్టెంబర్‌లో కమిటీ నివేదిక ఇస్తే ఇప్పుటివరకు ఏం చేశారని హైకోర్టు నిలదీసింది. కార్మిక, అగ్నిమాపకశాఖ, పర్యావరణ, ఫార్మాస్యూటికల్, పరిశ్రమల చట్టాల ఉల్లంఘన జరిగిందని, దీనిపై ఫ్యాక్టరీ, అగ్నిమాపక శాఖలు వేర్వేరుగా ఫిర్యాదు చేశాయని వివరించారు. ఘటన ఉదయం 9.45 గంటలకు జరిగితే, ఉదయం 11:40 గంటలకే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. ఈ ఘటనలో ఫ్యాక్టరీ ఉపాధ్యక్షుడు కూడా చనిపోయారని గుర్తుచేశారు. అందువల్లనే కంపెనీ డైరెక్టర్లను అరెస్ట్ చేయలేదని తెలిపారు. పిటిషనర్ న్యాయవాది కల్పించుకుంటూ.. బాధితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందలేదని చెప్పారు. అదృశ్యమైన వారి కుటుంబాలకు 25 లక్షలకు మించి చెల్లించలేదని తెలిపారు.