హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులను నిర్దిష్ట సమయంలోగా పరిషరించాలని తాము స్పీకర్‌కు గడువు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని, దీనిపై మీ వైఖరి ఏమిటో చెప్పాలని అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ప్రశ్నించింది. బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలుచేసిన పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం కూడా వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై పిటిషన్లను మూడు నెలల్లోగా పరిషరించాలని చెప్పారు.
దీనిపై అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి స్పందిస్తూ.. స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలు జారీ చేయరాదన్నదే తమ వాదన అని, పిటిషన్‌కు విచారణార్హత లేదని ప్రకటించాలని తాము మొదటినుంచి వాదిస్తున్నామని, ఈ పరిస్థితుల్లో కోర్టు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. మణిపూర్ ఎమ్మెల్యేలకు సంబంధించి కేశం మెఘాచంద్ కేసులో సుప్రీంకోర్టు నిర్దిష్ట గడువులోగా స్పీకర్ తన ముందున్న పిటిషన్‌పై ఉత్తర్వులు జారీచేయాలని చెప్పింది కదా? అని హైకోర్టు ప్రశ్నించింది. మరో సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ కల్పించుకుంటూ.. స్పీకర్ ముందున్న పిటిషన్లను విచారణ చేయాలని ఇప్పటివరకు సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని చెప్పారు. మణిపూర్ ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని 142వ అధికరణం కింద స్పీకర్‌కు నోటీసులు జారీ చేసిందని గండ్ర మోహన్‌రావు గుర్తుచేశారు. స్పీకర్ రాజ్యాంగ విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని గండ్ర మోహన్‌రావు ఆరోపించారు.
రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో పార్టీ ఫిరాయింపుల పిటిషన్‌పై ఏ చర్యలూ తీసుకోకుండా స్పీకర్ కాలయాపన చేస్తున్నారని తప్పుపట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఒకరు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన తర్వాత కూడా స్పీకర్ తీరులో మార్పు లేదని తప్పుపట్టారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విధులను నీరుగార్చడమేనని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం స్పీకర్‌కు కోర్టులు (హైకోర్టు/సుప్రీంకోర్టు) ఆదేశాలు జారీ చేయవచ్చునని వాదించారు. తన వాదనను బలపరిచే పలు తీర్పులను ఆయన ఉదహరించారు. స్పీకర్ మూడు నెలల గడువులోగా పార్టీ ఫిరాయింపుల పిటిషన్‌పై విచారణ పూర్తి చేయాలని మణిపూర్ ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల విసృ్తత ధర్మాసనం తీర్పు చెప్పిందని తెలిపారు. ఆ తీర్పును హైకోర్టు అమలు చేయాలని కోరారు.
నాలుగు వారాల్లో తేల్చమనండి
మూడు నెలల గడువు ఎప్పుడో ముగిసిందని, మరో నాలుగు వారాల గడువు ఇచ్చి తుది నిర్ణయం తీసుకునేలా స్పీకర్ కార్యాలయానికి ఉత్తర్వులు ఇవ్వాలని గండ్ర మోహన్‌రావు కోరారు. స్పీకర్, పార్టీ ఫిరాయింపుల పిటిషన్లపై చర్యలు తీసుకోకుండా ఉంటే ప్రజాస్వామ్యానికి అర్థమే లేకుండా పోతుందని అన్నారు. అనర్హత వేటు వేయాలనే పిటిషన్‌ను స్పీకర్ విచారణ చేయకుండా కాలయాపన చేసిన పరిస్థితుల్లో ఆ వ్యవహారంపై హైకోర్టు/సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేయవచ్చునని చెప్పారు. మార్చిలో స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని, ఇప్పటికి మూడు నెలల గరిష్ఠ గడువు ముగిసినందున మరో నాలుగు వారాలు స్పీకర్ సమయం తీసుకునేలా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అసెంబ్లీ రూల్స్ 6, 7 ప్రకారం స్పీకర్ వ్యవహరించడం లేదని మోహన్‌రావు వాదించారు. స్పీకర్ నిర్ణయం తీసుకున్నాకే కోర్టులు న్యాయ సమీక్ష చేయవచ్చని ఏజీ చెప్పారు. స్పీకర్ వద్ద పిటిషన్‌కు నంబర్ కేటాయించమని కూడా ఉత్తర్వులు జారీ చేసే పరిధి కోర్టులకు లేదని అన్నారు. ఈ కేసులో వాదనలు బుధవారం కూడా కొనసాగనున్నాయి.