హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి బీజేపీ నేత బండి సంజయ్‌పై మాల్‌ప్రాక్టీస్ చట్టం కింద నమోదు చేసిన కేసుకు చట్టబద్ధత ఏమిటో చెప్పాలని హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించింది. 2023లో హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీసు స్టేషన్లో నమోదైన ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ మంగళవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పలు సందేహాలు వ్యక్తం చేశారు. పరీక్ష జరుగుతున్న సమయంలో బయటి వ్యక్తి లోపలికి ఎలా వచ్చారని ప్రశ్నించారు. ఒకవేళ ఆ వ్యక్తి లోపలికి వస్తే అది ప్రభుత్వ వైఫల్యమే అవుతుందని పేర్కొన్నారు. ఆ వ్యక్తికి ఉపాధ్యాయులు సహకరిస్తే వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు.