హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు (Harish Rao) హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కోట్టివేసింది. రియల్ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఫోన్‌ట్యాపింగ్ కేసును కొట్టివేయాలని కోరుతూ హరీశ్‌రావు హైకోర్టులో (High Court) పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై 27న వాదనలు పూర్తయ్యాయి. తాజాగా పిటిషన్‌ను కొట్టివేస్తూ ధర్మాసనం తీర్పును వెలువరించింది.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది దామ శేషాద్రినాయుడు, న్యాయవాది ఆర్ చంద్రశేఖర్‌రెడ్డి తమ వాదనలు వినిపిస్తూ.. చక్రధర్‌గౌడ్ తరపున ప్రభుత్వం వకాల్తా తీసుకున్నట్టుగా వాదనలు ఉన్నాయని తప్పుపట్టారు. కేసు దర్యాప్తు అధికారి ఎడాపెడా అరెస్ట్ చేసి నిందితులను భయభ్రాంతులకు గురిచేశారని, వాళ్లను భయపెట్టి బలవంతంగా తమకు కావాల్సిన రీతిలో వాంగ్మూలాలు తీసుకొని ఈ కేసులో హరీశ్‌రావును ఇరికించే కుట్ర చేస్తున్నారని చెప్పారు. చక్రధర్‌గౌడ్‌పై లైంగికదాడి సహా మొత్తం 11 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
ఆ కేసులు తప్పుగా నమోదైనవో, కాదో తేల్చాల్సింది కోర్టులని, కానీ ప్రభుత్వమే అవి తప్పుడు కేసులు అంటున్నదని చెప్పారు. ప్రాసిక్యూషన్ రెండు రకాలుగా వాదనలు వినిపిస్తున్నదని తెలిపారు. చక్రధర్‌గౌడ్ తన ఎన్నికల అఫిడవిట్లలో సొమ్ము లేదని పేరొన్నారని, తరువాత ట్రస్ట్ పేరుతో నిధులు పంపిణీ చేశారంటున్నారని, ఈ బాగోతంపై ఆదాయపు పన్ను శాఖతో దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని చెప్పారు. చక్రధర్‌గౌడ్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గతంలో తనపై నమోదైన పలు కేసులను కోర్టు కొట్టేసిందని, కొన్ని కేసుల్లో స్టే ఉత్తర్వులు ఉన్నాయని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ లక్ష్మణ్ ప్రకటించారు. ఇదే కేసులో రెండో నిందితుడు రిటైర్డ్ పోలీస్ అధికారి రాధాకిషన్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేస్తామని వెల్లడించారు.