హైదరాబాద్ ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మలాజిగిరి జిల్లా గండిమైసమ్మ మండలం కొంపల్లిలోని 105 సర్వే నంబర్లో రోడ్డు ఆక్రమణలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని హైకోర్టు కొంపల్లి మున్సిపల్ అధికారులను ఆదేశించింది. రియల్ ఎస్టేట్ సంస్థ కాసాగ్రాండ్ హైడర్ వైజ్ ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీ జీ రంజిత్‌రెడ్డి ఆ రోడ్డును ఆక్రమించుకుని కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదన వినిపిస్తూ.. 40 అడుగుల రోడ్డును రియల్ ఎస్టేట్ సంస్థ ఆక్రమించి కాంపౌండ్ నిర్మిస్తోందని, దీంతో ఆ పక్కనే ఉన్న తన ప్లాట్‌కు దారి లేకుండా పోతోందని వివరించారు. దీనిపై మున్సిపల్ అధికారులకు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోలేదని తెలిపారు. దీంతో ఆ రోడ్డును ఆక్రమణలను పరిశీలించి, చట్టప్రకారం తగిన చర్యలు చేపట్టాలని హైకోర్టు మున్సిపల్ అధికారులను ఆదేశించింది.