హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం లంచం తీసుకున్న సరూర్‌నగర్ సబ్‌రిజిస్ట్రార్ శ్రీలతతోపాటు ఆమెకు ముడుపులు ఇచ్చినట్టు చెప్తున్న సుదర్శన్ అనే వ్యక్తిపై విచారణ చేపట్టాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్‌ను, రాచకొండ డీసీపీని హైకోర్టు ఆదేశించింది. ఇది సివిల్ వ్యవహారమంటూ ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీసులు తిరసరించడంపై విచారణ జరిపి ఈ నెల 14లోగా నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. శ్రీలతకు నోటీసులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీని ప్రతివాదిగా చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.