హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): పదోన్నతులకు అనుగుణంగా బాధ్యతలను స్వీకరించాలంటూ డాక్టర్లపై ఒత్తిడి తేవొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్, వరంగల్లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న తాము నిరాకరించినప్పటికీ సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్, మెడికల్ ఎడ్యుకేషన్ అదనపు డైరెక్టర్ పోస్టులకు పదోన్నతి కల్పించారంటూ డాక్టర్ ఏ సుభోద్కుమార్ సహా ఏడుగురు విడివిడిగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తూ ఈ నెల 7న ఇచ్చిన జీవో 298ని కొట్టేయాలని కోరారు. దీనిపై శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్, న్యాయవాది బొబ్బిలి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
పదోన్నతులపై పిటిషనర్ల అభిప్రాయాలను కోరినపుడు వారు నిరాకరించారని చెప్పారు. పదోన్నతులు ఇస్తే సమీప ప్రాంతాలకే బదిలీ చేయాలని కోరినట్టు తెలిపారు. ఇందుకు విరుద్ధంగా ప్రమోషన్స్ ఇచ్చారని పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను 22వ తేదీకి వాయిదా వేసింది.