హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): మధ్యాహ్న భోజనం వికటించిన పాఠశాలల స్థితిగతులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారాన్ని పెట్టితీరాలని తేల్చి చెప్పింది. భోజనం వికటించిన ఘటనలపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన టాస్ఫోర్స్ కమిటీలు, వాటిలోని సభ్యుల వివరాలను నివేదించాలని ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదని, ప్రైవేట్ పాఠశాలలో ఫీజు నియంత్రణకు కమిటీని నియమించేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కీతినీడి అఖిల్శ్రీ గురుతేజ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.
పిటిషనర్ తరఫున న్యాయవాది చికుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజనాన్ని పకాగా పర్యవేక్షించాల్సి ఉంటుందని, కానీ అలా జరగడం లేదని చెప్పారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. ‘నారాయణపేట, కరీంనగర్ జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో వేర్వేరుగా కమిటీలు ఏర్పాటు చే శాం. భోజనం వికటించిన ఘటనపై దర్యా ప్తు జరుగుతున్నది. రాష్ట్రంలో మొత్తం 25,941 ప్రభుత్వ పాఠశాలున్నాయి. 18 లక్షల మందికిపైగా విద్యార్థులన్నారు. మూడు చోట్ల 75 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురయ్యారు. ఇలాంటివి మరోసారి జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా పెంచింది’ అని పేరొన్నారు.